రెండవ ఓటర్ జాబితాలో భాగంగా సవరణ కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఫిజికల్ గా వచ్చే ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయాలని, దరఖాస్తులను సంబంధిత తహసీల్దారులు బూత్ స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు కేటాయిస్తూ వారం రోజులలో క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ , ఆర్డీఓ లు ఆనంద్ కుమార్ మధు సూధన్ , ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ టర్న్ అవుట్ పెంపుకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్పత్తి తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.