దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ శంభు లింగేశ్వరాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మిరుదొడ్డి, రాయపోల్, తొగుటతోపాటు మెదక్ జిల్లాలోని చేగుంట, రామాయంపేట మండలాలకు చెందిన భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ఆలయాన్ని వివిధ రంగులతో అందంగా అలంకరించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశాఉ. ఎత్తైన గుట్టపై స్వయంభు లింగరూపంలో అవతరించడంతో స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం. దానికి తోడు మహాశివరాత్రి రోజున శ్రీ శంభు లింగేశ్వర స్వామి దర్శనమిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవాలకు తరలిరానున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాల సందర్భంగా మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, యువతుల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివకుమార్ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. వీరితోపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ప్రముఖ కళాకారులు అంజన్న ఆకునూరు దేవన్న,
అమూల్యస్తుడు వేణు గజ్వేల్ నక్క శ్రీకాంత్, కమ్మరి తిరుపతి, ఆర్కెస్ట్రా నాగలక్ష్మి, సింగర్ ముకుంద హాజరుకానున్నారు. ఈనెల 17నుండి ప్రారంభం కానున్న ఉత్సవాలు 19తేదీన ముగియనున్నాయి. ఫిబ్రవరి 17 ఉదయం భజన కీర్తనలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తేదీన అఖండ దీపారాధన, గణపతి పూజ, రుద్రాభిషేకం, గోమాత పూజ, దేవతామూర్తులకు చెరువులో స్నానాలు చేయించడం, రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. అగ్నిగుండాలు తొక్కడం, వీరభద్రుడి దివిటీలు, 19న ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా అగ్నిగుండాలు తొక్కడం, ఎడ్ల బండ్ల ఊరేగింపు ప్రధాన ఆకర్షనగా నిలవనున్నాయి. 18వ తేదీన భరత్ కళాబృందం కుక్కల ఐలయ్య ద్వారా బ్రహ్మాండంగా ఒగ్గు కథలు నిర్వహించబడుతాయి. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో ప్రత్యే లైటింగ్ ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి సదుపాయం, బస చేయడానికి గల ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేసింది. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించానికి పోలీసులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. శాంతియుతంగా ఉత్సవాలను పూర్తి చేయడానికి ఆలయ కమిటీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది.
• *అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం – ఆది వేణుగోపాల్ (ఆలయ కమిటీ చైర్మన్)*
శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌక ర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి వసతిని ఏర్పాటు చేశాం. భక్తుల తాకిడి ఈసారి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కల్పించాము అని అన్నారు.