ఏప్రిల్ 10,24/7 తెలుగు న్యూస్: సోషల్ మీడియాలో సీపీఐ (ఎం)
‘కృత్రిమ మేథ’తో ప్రచారంలో దూసుకుపోతున్న మార్క్సిస్టులు
‘సమత’ పేరిట ఏఐ అవతార్ ఆవిష్కరణ
అంకితభావంతో పనిచేస్తున్న వాలంటీర్లు, కామ్రేడ్లు
ఎప్పటికప్పుడు ఓటర్లు, కార్యకర్తలకు తాజా సమాచారం
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న సీపీఐ (ఎం) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఓటర్లను చేరుకుంటోంది. 2014లోనే పలు సోషల్ నెట్‌వర్కింగ్, ఇంటరాక్టివ్ డిజిటల్ వేదికల్లో ఉనికిని చాటుకున్న పార్టీ దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు సామాజిక మాధ్యమానికి సంబంధించిన ఆకర్షణీయమైన ప్రపంచంలో అడుగు పెట్టింది. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులతో విజయవంతంగా పోటీ పడుతోంది.
ప్రస్తుతం సీపీఐ (ఎం)కు వివిధ రాష్ట్రాల్లో పలు హ్యాండిల్స్, సామాజిక మాధ్యమ పేజీలు ఉన్నాయి. వీటి సాయంతో రెట్టించిన సమధికోత్సాహంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాఖ మొదటి స్థానంలో ఉంది. బెంగాల్‌లో కృత్రిమ మేథ (ఏఐ)ను ప్రచార సాధనంగా సీపీఐ (ఎం) ఎంచుకుంది. గత నెలలో సమానత్వానికి చిహ్నమైన ‘సమత’ పేరిట ఏఐ అవతార్‌ను ఆవిష్కరించింది. వారానికి రెండుసార్లు ఇంగ్లీషు, హిందీ భాషల్లో వార్తా బులెటిన్లు ప్రసారమవుతున్నాయి.
పకడ్బందీ వ్యూహంతో…
పశ్చిమ బెంగాల్ పార్టీ కార్యాలయం నుంచి, మారుమూల ప్రాంతాల వరకు 50-60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐకి చెందిన వాలంటీర్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మహా యజ్ఞంలో నిపుణులెవ్వరూ పాలుపంచుకోవడం లేదు. ఐదుగురు వాలంటీర్లతో కూడిన కేంద్ర బృందం దేశ రాజధాని నుండి విధులు నిర్వర్తిస్తోంది. కేంద్ర బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరు వాలంటీర్లను నియమించారు. మొత్తంమీద వివిధ వేదికల ద్వారా ప్రతి రోజూ 30-40 పోస్టులు పెడుతూ తాజా సమాచారాన్ని అందజేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల రణరంగాన్ని సీపీఐ (ఎం) పునర్నిర్వచించింది. పశ్చిమ బెంగాల్ సమాచారాన్ని ఇతర రాష్ట్రాల కామ్రేడ్లకు చేరవేయడమే ‘సమత’ ఉద్దేశమని ఆ రాష్ట్ర సామాజిక మాధ్యమ బృందం నేతలు తెలిపారు. సామాజిక మాధ్యమ బృందాల పనితీరులో ఇప్పుడు కొట్టొచ్చినట్లు మార్పు కన్పిస్తోంది. వీటిని సీపీఐ (ఎం) వాలంటీర్లు, కామ్రేడ్లే నడుపుతున్నారు. గ్రాఫిక్స్, ప్రచార వీడియోలు, రీల్స్, చిన్న చిన్న డాక్యుమెంటరీలు, అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు…వీటన్నింటినీ ఎప్పటికప్పుడు తాజా పరుస్తూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా వివిధ వేదికల్లో పోస్టు చేస్తున్నారు. ప్రధాన కార్యక్రమాలు, పత్రికా సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు. అంతా పకడ్బందీ వ్యూహంతో సాగుతోంది.
లేట్ అయినా లేటెస్టుగా…
‘ఇతర పార్టీలతో పోలిస్తే మేము ఆలస్యంగానే పని ప్రారంభించాం. పార్టీ అవగాహన కారణంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందజేయడం కష్టమైన పనే. నిధుల లభ్యత కూడా అడ్డంకిగా ఉంది. వాస్తవానికి మేము కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేశాము. వాలంటీర్లు, కామ్రేడ్లను నియమించుకున్నాము’ అని సామాజిక మాధ్యమ బృందం సభ్యుడొకరు తెలిపారు. 2014లో సోషల్ మీడియాను వాడుకోవాలని విశాఖపట్నంలో జరిగిన పార్టీ సమావేశంలో నిర్ణయించారు. నెమ్మదిగా పని ప్రారంభించినప్పటికీ 2019 ఎన్నికల సమయంలో డిజిటల్ వేదికల ద్వారా ప్రచారాన్ని నిర్వహించారు. 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల సమయంలో మంచి ప్రదర్శన కనబరిచారు.
అవసరమే : కరత్
ప్రస్తుతం సామాజిక మాధ్యమాన్ని, సాంకేతిక పరిజ్ఞానంలో నూతన ఆవిష్కరణలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, అది తప్పనిసరి అయిందని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్ చెప్పారు. ‘ఇవాళ యువతలో ఎక్కువ మంది వేర్వేరు సామాజిక మాధ్యమ సాధనాలను వాడుతున్నారు. వారు సామాజిక మాధ్యమాల ద్వారానే వార్తలు చదువుతున్నారు. అవగాహన చేసుకుంటున్నారు’ అని అన్నారు. కాగా డిజిటల్ వేదికల పనితీరును వివరించడానికి సెమినార్లు, సదస్సులు నిర్వహిస్తున్నారు. వాలంటీర్లు, కామ్రేడ్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలితాలను ఇస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఒకటి మినహా మిగిలిన 21 జిల్లాలలోనూ సామాజిక మాధ్యమ బృందాలు అంకితభావంతో పనిచేస్తున్నాయి. యాభై శాతం పోలింగ్ కేంద్రాల్లో ఈ బృందాలకు బూత్ స్థాయి వాలంటీర్లు ఉన్నారు.
