ఏప్రిల్ 10, 24/7 తెలుగు న్యూస్: కార్మిక హక్కులు కాలరాస్తున్న మిమ్స్ యాజమాన్యం.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్) యాజమాన్యం ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తోంది. ఈ మెడికల్ కాలేజీలో 350 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మిమ్స్‌లో సిఐటియు అనుబంధ సంఘం 2011లో ఏర్పడిన నాటి నుండి 2011-2013, 2015-2017 సంవత్సరాలలో మొత్తంగా 4 సార్లు వేతన ఒప్పందాలు చేసింది. 2011 అక్టోబర్ నుండి 2020 ఏప్రిల్ వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏను క్రమం తప్పకుండా చెల్లించారు. 2020 కోవిడ్ సమయంలో యాజమాన్యం కొంతమంది ఉద్యోగులను లొంగదీసుకొని మిగిలిన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసింది. నాటి నుండి నేటి వరకు డిఏలను, వేతన ఒప్పందాన్ని ఎగ్గొట్టింది. సిఐటియు నాయకత్వం లేకపోతే ఉద్యోగుల నోళ్లు నొక్కి భయభ్రాంతులకు గురిచెయ్యవచ్చని యాజమాన్యం భావించి 2020లో 15 మంది కార్మికులను తొలగించి యూనియన్‌ను విచ్ఛిన్నం చేసింది. యాజమాన్యం గతంలో అంగీకరించిన హామీలను అమలు చేయకపోవడంతో ఇద్దరు ఉద్యోగులు యాజమాన్యాన్ని అడిగినందుకు వారిద్దరినీ ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా సస్పెండ్ చేసింది. దీంతో కార్మికులు విసిగి వేసారి తిరిగి మూడు సంవత్సరాల తరువాత (2024)లో సిఐటియును ఆశ్రయించారు. దీంతో మిమ్స్ కార్మికులు గత్యంతరం లేక అనివార్యంగా ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విధులను బహిష్కరించే పరిస్థితులను యాజమాన్యం కల్పించింది. 68 రోజులుగా కార్మికులు నిరసన దీక్షలు చేస్తున్నారు.
2019 నుంచి చేయవల్సిన వేతన ఒప్పందం చెయ్యకుండా యాజమాన్యం కార్మికులకు పెంచాల్సిన వేతనాలు ఎగ్గొట్టింది. ఆనాటి నుంచి 7 డిఏలు చెల్లించకుండా బకాయి ఉంది. కార్మికులందరిని పర్మినెంట్ చెయ్యకుండా జాప్యం చేస్తున్నది. మూర్తిరాజు చైర్మన్‌గా వున్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించేవారు. ప్రజలు, కార్మికులతో మంచి సంబంధాలు ఉండేవి. సిఐటియు ఆధ్వర్యాన 4 వేతన ఒప్పందాలు జరిగాయి. నేడున్న యాజమాన్యం తప్పుడు పద్ధతుల్లో కార్మికులపై కక్షగట్టి వ్యవహరిస్తోంది. దీని మూలంగా గత వారం రోజులుగా మిమ్స్‌లో అన్ని రకాల వైద్య సేవలు ఆగిపోయాయి. యూనియన్ నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరించి ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన యజమాన్యం…యూనియన్ నాయకులతో చర్చ జరపనని కార్మిక చట్టాలను ధిక్కరించి వితండ వాదం చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందకుండా, వైద్య విద్యార్థులకు చదువు లేకుండా చేస్తోంది. ఆసుపత్రి అనగానే పేషెంట్లు, డాక్టర్లతో హడావిడి కనిపిస్తుంది మనకి ఎక్కడైనా. కానీ మిమ్స్ ఆసుపత్రి మాత్రం గత 67 రోజులుగా పోలీసు పికెట్లు, లాయర్లు మీటింగ్‌లతో నిరంతరం ఉద్రిక్తంగా కనబడుతున్నది.
చట్టాలను అమలు చేయనంటున్న యాజమాన్యం
ట్రేడ్ యూనియన్ చట్టం (1926) ప్రకారం ఏ సంస్థలోనైనా ఏడుగురు సభ్యులుంటే యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది. అందులో ఆఫీస్ బేరర్లుగా బయటవారు ఉండటం కూడా అంతే హక్కు. ఈ చట్టాలను అమలు చెయ్యకుండా తన ఇష్టం వచ్చినట్లు చెయ్యాలనుకోవడం చట్టవ్యతిరేకం. మిమ్స్ యాజమాన్యం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను అమలు చెయ్యడంలేదు. విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఇక్కడ బోధనా సిబ్బంది లేరు. ల్యాబ్ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. హాస్పటల్‌లో ఇచ్చే మందులు నాశిరకం. విద్యార్థులకు బోధించటానికి ఎప్పుడూ రోగులే తగినంతమంది వుండరు. సమస్యల పరిష్కారానికై చర్చలు జరిగిన సందర్భంగా డిసియల్, జెసియల్, డిఎస్‌పి, ప్రజాప్రతినిధుల దగ్గర తమకు కార్మిక చట్టాలతో పనిలేదని, కార్మిక సంఘం నాయకులతో చర్చించబోమని యాజమాన్యం మొండిగా వ్యవహరించింది. వాస్తవానికి ‘ఇండిస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్’ (1926) ప్రకారం ఏదైనా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు సంఘం పెట్టుకునే హక్కుతోపాటు తమకు నచ్చిన యూనియన్‌కు అనుబంధంగా ఉండవచ్చు. ఆ యూనియన్ కమిటీలో బయటివారు సగం మంది ఆఫీస్ బేరర్లుగా వుండవచ్చని ఈ చట్టంలో ఉంది. కానీ నేడు మిమ్స్ యాజమాన్యం కార్మిక చట్టాలను ధిక్కరిస్తూ సమస్యను జటిలం చేస్తున్నది. జనవరిలో ఉద్యోగులంతా పనిచేశారు. పనిచేసిన జనవరి నెల జీతం ఫిబ్రవరి 7 లోపుగా చెల్లించాలని పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు (1936) చెప్తున్నది. కానీ నేటికి 70 రోజులు దాటినా జనవరి నెల జీతం చెల్లించలేదు. ఈ నెల 6న స్థానిక శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు దగ్గర ఈ నెల 11న జీతాలు చెల్లిస్తానని యాజమాన్యం అంగీకరించింది. కానీ నేటికి చెల్లించలేదు. సమస్యలు పరిష్కరించమన్న ఉద్యోగులపై కేసులు పెడుతున్న పోలీసులు…తాను ఏ చట్టాన్నీ అమలు చేయను, యూనియన్‌తో చర్చించను, జనవరి నెల జీతం చెల్లించను, బకాయి ఉన్న డిఏలు ఇవ్వను, ఎవ్వరి మాటా విననంటున్న మిమ్స్ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రాసిక్యూట్ చేసి చట్టరీత్యా శిక్షించవలసిన పోలీసులు 24 గంటలూ యాజమాన్యానికి కాపలా కాయడమేమిటి?
అడుగడుగునా పోలీసు నిర్బంధం
తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా పోరాడుతున్న ఉద్యోగులపై వారానికొక కేసు పెడుతున్నారు. ఈ ఉద్యమాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని, నలుగురు మహిళలతో పాటు యూనియన్ ముఖ్య నాయకులు ఏడుగురుపై ఏప్రిల్ 5వ తేది రాత్రి 10 గంటలకు అరెస్టు చేసి రాత్రంతా పూసపాటిరేగ స్టేషన్లో ఉంచి నాన్ బెయిల్‌బుల్ సెక్షన్లతో అక్రమ కేసులు బనాయించారు. మిమ్స్ దగ్గరున్న టెంట్లను పోలీసులు పీకేశారు. 34 మంది ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెట్టారు. గ్రామాల్లో ఉన్న కార్మికుల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తీసుకుపోతున్నారు. తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు ఇద్దరు సిఐటియు నాయకులను, 24 మంది ఉద్యోగులను జైలుకు పంపించారు. అరెస్టు చేసిన వారిని పరామర్శించేందుకు రాష్ట్ర నాయకులు వస్తే వారిని కూడా అడ్డుకుంటున్నారు. కార్మిక శాఖ పూర్తిగా యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నది.
సమ్మె చేస్తున్న మిమ్స్ ఉద్యోగులు ఇప్పటి వరకు అనేక నిరసన కార్యమ్రాలు చేపట్టారు. పలుమార్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. యాజమాన్యం నుంచి, పోలీసుల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్మికులు మాత్రం పట్టు విడవక ఐక్యంగా పోరాడుతున్నారు. ఆ పోరాటం విజయవంతం కావాలి.




