తెలుగు న్యూస్ 24/7 :భారత రత్న పురస్కారం.. భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దీన్ని జనవరి 2, 1954లో భారత మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ చేత స్థాపించబడింది. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని నలభై మందికి ప్రదానం చేశారు. అయితే ఇందులో ఇద్దరు విదేశీయులకి కూడా ఈ పురస్కారాన్ని అందజేశారు. వారిలో ఒకరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987), మరొకరు నెల్సన్ మండేలా (1990). ఈ జాబితాలోకి తాజాగా బిజెపి అగ్రనేత ఎల్.కె అద్వానీ కూడా చేరారు. శనివారం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అద్వానీకి ప్రదానం చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అద్వానీ చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా అద్వానీకి మోడీ అభినందనలు కూడా తెలిపారు.
ఇదిలా ఉండగా మరోవైపు.. భారతరత్న పురస్కారాన్ని ఎపి మాజీ ముఖ్యమంత్రి, నటుడు అయిన ఎన్టీఆర్‌కి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి ఎపి బిజెపి అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. మరి కుమార్తె తన పలుకుబడిని ఉపయోగించి భారతరత్న పురస్కారాన్ని ఎంపిక చేయాలని ప్రధానిని కోరుతారా? అలా చేస్తే ఎపి రాజకీయాలు ఎటువైపు మళ్లుతాయో?
అద్వానీ గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. దాదాపు మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయన పేరే వినబడడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో మోడీ కూడా అద్వానీని బుజ్జగించేందుకే భారతరత్నకు ఎంపిక చేశారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.