(మానకొండూర్ జనవరి 10)
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని కొండపల్కలలో బస్సు సౌకర్యాన్ని, గంగిపల్లిలో బస్సు షెల్టర్, వ్యాయామ జిమ్మును, నిజాయితీ గూడెం లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంగిపల్లి, నిజాయితీ గూడెం గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల ఆద్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…
ప్రభుత్వ పథకాల అప్లికేషన్ల ప్రక్రియలో ఆరు గ్యారెంటీలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు వారికి కావలసిన పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారని,ఈ అప్లికేషన్ల ప్రక్రియలో దాదాపు 40వేల కంప్యూటర్ల ఆపరేటర్లతో రాష్ట్ర వ్యాప్తంగా డాటా ఎంట్రీ జరుగుతుందని జనవరి 25,27వరకు ఈ డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఎక్కడెక్కడైతే అప్లికేషన్లు తీసుకున్నామో అదికారులతో మిగిలిన దరఖాస్తులను తీసుకుని అర్హత గలవారికి ప్రభుత్వ పథకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
తన మేనమామ ఊరైన గంగిపెల్లి గ్రామానికి చిన్ననాటి నుండి తనకు అనుభందం ఉందని గంగిపల్లిలో స్థానిక ఎమ్మెల్యే,ప్రజల సహకారంతో పాడైపోయిన రోడ్ల పునః నిర్మాణం చేపడుతానని హమి ఇచ్చారు.ఇది హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు కాకుండా బయటి ప్రజలకు ఇస్తున్న మొట్ట మొదటి వాగ్దానమన్నారు. అధికారులతో స్థానిక ప్రజాప్రతినిధుల ఆద్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి తో సమావేశాన్ని ఏర్పాటు చేసి రోడ్లును మంజూరును చేయిస్తానని దీమా వ్యక్తం చేశారు.
రాజకీయ జీవితంలో విద్యార్థి నాయకుడిగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మార్క్ ఫెడ్ చైర్మెన్ గా ఎంపీగా పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో మల్లీ ఒకసారి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టి గుర్తించి తనకు మంత్రిగా అవకాశం కల్పించిందని ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉందని ప్రజా సమస్యలు పరిష్కరించడంకోసం రైతు బిడ్డగా నిరంతరం కృషి చేస్తానని అన్నారు.గత పది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యమైందని విద్యా వ్యవస్థకు అన్ని రకాల సౌకర్యాలు కలిగే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు, మండల నాయకులు,కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.