Breaking News

సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి-బి యస్ ఐ డిమాండ్ :

179 Views

తెలుగు న్యూస్ 24/7 జనవరి 3:చదువుల తల్లి, అమ్మా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి- బి ఎస్ ఐ డిమాండ్.

బ్రిటీషు ప్రభుత్వము నుండి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను 1947 తర్వాత పొందిన అనేక దేశాలు అక్షరాస్యతలో భారతదేశం కంటే ముందంజలో ఉన్నాయి. దానికి కారణం చాలా స్పష్టంగా అందరికి తెలిసినప్పటికీ భారతదేశ సంస్కృతి, వైభవం, సనాతన సంప్రదాయాలు చాలా గొప్పవని భావిస్తూ ఇప్పటికి కూడా వాస్తవం గ్రహించని భారత సమాజమే అందుకు ప్రధాన కారణం.

స్త్రీలందరు శూద్రులే అని చెప్పింది, ఏ ఒక్క బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాదు. శూద్రులు చదువుకో కూడదని, శూద్రులు ఆయుధం ధరించరాదని, శూద్రులు ఆస్తి కలిగియుండరాదని చెప్పింది మూలవాసులు కాదు. సనాతన సంప్రదాయం పేరుతో భారతీయ సమాజం మీద కోడ్ ఆఫ్ కండక్ట్ విధించింది బ్రాహ్మణీయ సంస్కృతి మనుస్మృతి ద్వారా మాత్రమే.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరిశీలిస్తే భారత్ సమాజానికి ఏ విధంగా నష్టం కలిగిందో అంతగా అవగాహన రాదు. కానీ వారి భార్యలైన సరస్వతి, లక్ష్మీ, దుర్గలను పరిశీలిస్తే భారత దేశంలోని పౌరులకు అందవలసిన విద్య, ఆస్తి, ఆయుధం కొంతమందికి మాత్రమే పరిమితం చేసి బహుజనులకు శాశ్వతంగా వీటిని దూరం చేయటం అనేది సాంస్కృతిక పరంగా జరిగింది. ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే బుద్ధుడు మొదలు పూలే బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ వరకు విద్య, ఆయుధం, ఆస్తి, తిరిగి పొందటానికి నిరంతరంగా కృషి చేశారు. అందులో భాగంగానే మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రీబాయి పూలేని మొదటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా తయారు చేయటం అనేది ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక పెద్ద చారిత్రాత్మకమైన విషయం

సావిత్రిబాయి మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాలా తాలూకాలో నైగాన్ గ్రామంలో జగదేవ్ పాటిల్కు ప్రథమ సంతానంగా జనవరి 3, 1831 లో సావిత్రిబాయి జన్మించింది. సావిత్రిబాయికి ఎనిమిది సంవత్సరాల వయసులో, 13 సంవత్సరాల జ్యోతిరావ్ గోవిందరావు పూలేతో బాల్య వివాహం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలు ఆంగ్లేయులు 1819లో కలకత్తాలోను‌, 1824లో బొంబాయిలో స్థాపించారు.

జ్యోతిబాపూలే మాలే అనే శూద్ర కులానికి చెందిన మూలనివాసి. 1848లో నిమ్న వర్గాలకు చెందిన అతిశూద్రు బాలబాలికల కొరకు పూనేలో బుదవారపేటలో బిడేగారి ఇంటిలో పాఠశాలను స్థాపించాడు.

ఉదార హృదయుడైన ఒక పేద మాలి ఓబీసీ , తన సొంత డబ్బుతో మూలవాసుల కోసం ఒక పాఠశాలను తెరవడం మరియు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ దాన్ని ఉత్తమంగా నిర్వహించడం ప్రశంసనీయమని పూనా అబ్జర్వర్ పత్రిక ప్రచురించింది. పూలే మొదట్లో విద్యను తానే నేరుగా పిల్లలకు నేర్పించారు. జ్యోతిరావు పూలే తన బార్యకు చదువు స్వయంగా నేర్పించారు. తను నేర్చుకున్న పాఠాలు సావిత్రిబాయి ఆడపిల్లలకు నేర్పించేవారు. సావిత్రిబాయి మరియు షేక్ ఫాతిమాబీబి, 1846-47లో పూణేలోని అహ్మద్ నగర్ లో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినారు. సావిత్రిబాయి మొదటి మహిళా ఉపాధ్యాయునిగా, షేక్ ఫాతిమాబీబి ద్వితీయ మహిళా ఉపాధ్యాయిని. పూణేలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కేశవ్ శివరామ్ బావల్కర్ అనే మిత్రుడు సహకారంతో 1-11-1948 నుండి ప్రత్యేకంగా బాలికలకు విద్యను అందించారు. జ్యోతిబా పూలే, జగన్నాథ సదాశివ్, కేశవ శివరాం జోషిలాంటి వారితో “”స్త్రీ విద్యా సంస్థను”” స్థాపించారు. 3-7-1851లో అన్నాసాహెబ్ చిఫ్లాంకర్ వాడలో ఎనిమిది మంది బాలికలతో పాఠశాల ప్రారంభించబడి తదుపరి 48కి పెరిగింది. ఇచ్ఛోటనే సావిత్రిబాయి భారతీయ మొదటి మహిళా ఉపాధ్యాయినిగా పనిచేసింది. తదుపరి పూనేలోని రిస్తాపేటలో
ది:17-9-1851లోను మరియు 15-3- 1852లో తన మిత్రుల సహకారంతో పాఠశాలను ప్రారంభించాడు. పూణేలోని బ్రాహ్మణ ఉపాధ్యాయులు పిల్లలను దండించడానికి బెత్తం తప్పనిసరిగా ఉంచుకునేవారు. ఎందుకనగా “”దండం దశ గుణం భవత్”” అని తమ మత గ్రంథాల్లో రాసుకున్నారు. అందరిని కొట్టే బెత్తంతో ఎస్సీ ఎస్టీ పిల్లలను కొడితే, అది ఇతర విద్యార్థులకు మైలు సోకుతుందని, ముందు ఆ బెత్తం ద్వారా ఉపాధ్యాయుడే మైలు పడతాడని అంటరాని కులాల పిల్లలను దండించడానికి చిన్న చిన్న రాళ్ళు తమ దగ్గర పెట్టుకొని విసిరేవారని రెవరెండ్ ముర్రె మిచెల్ తన జ్ఞాపకాల గ్రంథంలో రాసినాడు.

ఇందుకు భిన్నంగా అమ్మ సావిత్రిబాయి అంటరాని కులాల వారికి తన బావి దగ్గర స్నానం చేయించారు. దుస్తులు ఇచ్ఛారు. స్వయంగా అన్నం పెట్టి, చదువు నేర్పించి, పాఠశాలలకు పిల్లలను పంపిన తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇచ్చి అన్నార్తులను ఆదరించిన మాతృమూర్తి సావిత్రిబాయి.

ప్రభుత్వ పాఠశాలలోని ఎన్రోల్మెంట్ కంటే సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉండేది. ఎందుకనగా పిల్లలు, టీచర్లు ఒకే జాతికి చెందిన వారు.
క్రాంతి జ్యోతి అమ్మా సావిత్రిబాయి పూలే జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు:

1. 1853లో 35మంది బ్రాహ్మణ వితంతువుల కొరకు సేవా సదనం ఏర్పరచి వారికి పురుడు పోసి అనాధ పిల్లలను ఆదుకున్న ప్రేమ మూర్తి అమ్మా సావిత్రి భాయి.

2. 1854లో కావ్య పూలే పద్య రచనలను సంకలనం చేసింది.

3.1855లో వయోజనులకు రాత్రి పాఠశాలలను ఏర్పరచిన కార్యనిర్వాహకరాలు సావిత్రిబాయి.

4. 8-3-1860లో బ్రాహ్మణ విధవ వివాహం ఆదర్శవంతంగా చేసిన మార్గదర్శకులు సావిత్రిబాయి.

5. 25-12- 1873లో కులాంతర వివాహాల్ని పురోహితుడు లేకుండా ప్రజల భాషలో సావిత్రిబాయి పూలే మొదటి పెళ్లి చేశారు. వివాహంలో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రజలను జాగృతం చేసిన మొదటి మహిళా సంఘ సంస్కర్త.

6. 1877లో ఏప్రెల్ లో విద్యార్థుల కొరకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన అంశంగా కరువులు తరచుగా ఎందుకు సంభవిస్తున్నాయి? కరువులకు మొదటిగా శూద్రులే ఎందుకు బలి అవుతున్నారు? ఆకలి చావులు ఆపడం ఎలా? కరువులు నివారించాలంటే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు ఇచ్చిన ఆలోచనాపరురాలు సావిత్రిబాయి.

7. 1877లో బ్రాహ్మణ వితంతువైన కాశీకి పుట్టిన బిడ్డను దత్తత చేసుకొని యశ్వంత్ అని పేరు పెట్టి డాక్టర్ను చేసి తన యావదాస్తిని దత్తత చేసుకున్న కొడుకుకు వీలునామా ద్వారా ఇచ్చిన ఆదర్శ మహనీయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి.

8. 14-4-1890లో వితంతు స్త్రీల శిరముండన వ్యతిరేక ఉద్యమం చేసింది. శిరోముండనం చేసే మంగళ్ళను సమీకరించి వారితో ప్రతిజ్ఞ చేయించి బ్రాహ్మణ వితంతువులకు శిరోముండనం చేయకుండా స్త్రీల హక్కుల కొరకు ఉద్యమం చేపట్టిన కరుణామయి సావిత్రిబాయి.

9. 1890లో జ్యోతిబా మరణించినప్పుడు సత్యశోధక్ సమాజ్ ఆశయాల ప్రకారంగా సావిత్రిబాయి కర్మకాండ నిర్వహించే కుండను తానే పట్టుకొని, కొడుకు యశ్వంతుతో పాటు అంతిమయాత్ర ముందుండి నడిపించిన ధైర్యశాలి సావిత్రిబాయి.

10. 1897లో పూనాలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అమ్మా సావిత్రిబాయి పూలే మూలనివాసి పిల్లలను దూరంగా ఉన్న గ్రామాలకు పంపి వేసింది. జనమంతా అడవుల్లోకి పారిపోయారు. వైద్య విద్యను చదివిన కొడుకు యశ్వంత్ పరిచర్యలో ఫ్లేగు వ్యాధిగ్రస్తులకు సపర్యలు చేసింది. యశ్వంత్ అమ్మతో, అమ్మా!….ఫ్లేగు భయంకరమైన అంటువ్యాది. నీవు జబ్బు పడిన వాళ్ళను మోసికెళ్ళుతున్నావు నువ్వు కూడా ప్లేగు వ్యాధి బారిన పడవచ్చు. అమ్మా దయచేసి నా మాట విను. నీవు వారికి దూరంగా ఉండు, అని చెప్పాడు. దానికి సావిత్రిబాయి నీ పని నువ్వు చెయ్యి, నా పనిని నన్ను చేసుకో నివ్వు. నీవు జ్యోతిబా బిడ్డవు. మనిషి ఏదో ఒక రోజు చావాల్సిందే. నీ ఉద్రేకాలు, ప్రేమలు, అదుపు చేసుకో. వాటిని నీపని కోసం ఉపయోగించు. వ్యాధి సోకిన బిడ్డకు సపర్యలు చేస్తూ, పనిలో ఉండగానే మృత్యువు ఆవరించింది. 10-3- 1897లో జనహితం కోసం, స్వార్థరహిత సామాజిక సేవ చేసిన మానవతా మూర్తి సావిత్రిబాయి. తదుపరి యశ్వంత్ కూడ మరణించినాడు.

మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి, యశ్వంత్ మరణించినప్పటికి, వారు చేపట్టిన సామాజిక మార్పు ఉద్యమాన్ని తుదివరకు కొనసాగించాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. బ్రాహ్మణీయ కుల సంస్కరణ వాదులందరూ తమ స్త్రీలను, ఇంటికే పరిమితం చేస్తే, దానికి భిన్నంగా బుద్ధుడు మొదలు పూలే, అంబేద్కర్, పెరియార్ లాంటి సామాజిక విప్లవ కారులు తమ స్త్రీలను సామాజిక ఉద్యమంలో స్త్రీలను ముందుంచి వారిని గౌరవించి, ఉద్యమాన్ని నడిపించారు. మూలవాసులు అందరూ మాతృస్వామ్యనికి చెందిన వారు కనుక పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ఆత్మగౌరవాన్ని ఇచ్చిన వారే నిజమైన సంస్కరణవాదులు.

స్త్రీ, పురుషుని కంటే ఎక్కువ శక్తి వంతురాలు. తాటకి వెయ్యి ఏనుగుల బలం కలిగినదని చెబుతారు. ఏ ఋణమైనా తీర్చుకోవచ్చు. పురుషుడు దురాశపరుడు. స్త్రీ, పురుషులిరువురూ సమానులే. సాంఘిక న్యాయం ఇరువురి పట్ల సమానంగా ఉండాలి. క్రాంతి జ్యోతి అమ్మా సావిత్రిబాయి పూలే కులాలకు, మతాలకు అతీతంగా సామాజిక సేవ చేసిన మొదటి మహిళా సామాజిక కార్యకర్త. భారతీయ మహిళల జీవన వికాసానికి కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆదిపత్య కులాల స్త్రీలకు కూడా మొదటగా విద్యనందించిన మూలనివాసి. ఈ దేశ ఆది భారతీయులు ఈ కారణం చేతనే దేశవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల నుండి క్రాంతి జ్యోతి అమ్మా సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జనవరి 3ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము.

(రాష్ట్రపిత జ్యోతిబాపూలే-క్రాంతి జ్యోతి అమ్మా సావిత్రిబాయి పూలే ఆదర్శ దంపతుల సామాజిక పోరాటం గురించి ఆనాటి బామ్ సెఫ్ నాయకుడు బేతాళ సుదర్శనం ద్వారా తెలుసుకున్న ఫ్లాష్ సంస్థ యర్రంశెట్టి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా అమ్మా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏలూరు జిల్లా పరిషత్తు సెంటర్లో 3-1-2011నాడు ఏర్పాటు చేయడం జరిగింది.)

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *