కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై చిల్లర ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీఆరెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. గురువారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు, మాజీ కౌన్సిలర్ కలువల జగన్మోహన్ రావు మాట్లాడారు. నవంబర్ లో జరుగనున్న ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు విజయం తథ్యమని తెలియడంతో బీఆరెస్ చిల్లర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
దివాకర్ రావును ఓడించాలని ప్రజలు నిర్ణయించడంతో దిక్కుతోచని స్థితిలో బీఆరెస్ నేతలున్నారని అన్నారు. అసత్య ప్రచారంతో ప్రేమ్ సాగర్ రావుపై బురదచల్లే కార్యక్రమంకు తెర తీశారని మండిపడ్డారు. హైదరాబాద్ లో భూ వివాదం కోర్టు పరిధిలో ఉండగా ప్రేమసాగర్ రావు భూకబ్జా చేశాడని బీఆరెస్ నేతలు ఆరోపణలు చేయడం కోర్టు ధిక్కార మవుతుందని అన్నారు. ఎవరి భూమి ఎవరు కబ్జా చేశారు అనేది కోర్టు తీర్పు ఇస్తుందని, బీఆరెస్ నేతలు కాదని హితవు పలికారు.
ప్రేమ్ సాగర్ రావు నీతి, నిజాయితిగా వ్యాపారం చేసి పైకి వచ్చారని తెలిపారు. రౌడీ, గుండాయిజం, భూకబ్జాలు చేస్తున్నాడని బీఆరెస్ ఆరోపించడం శోచనీయమన్నారు. తప్పు చేస్తే కేసులు ఎందుకు పెట్ట లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తనయుడు నడిపెళ్లి విజిత్ రావు గుండాయిజం, రౌడీయిజం చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే తన తండ్రి పేరిట 57 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమించే ప్రయత్నం చేసారని ఆరోపించారు.
బీఆరెస్ నేతల భూకబ్జాల భాగోతంను బయతపెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నరేష్ , మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఉప్పలయ్య,ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేశ్ , ఇతర నేతలు పాల్గొన్నారు.
