అక్టోబర్ 01 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారు. హైద్రాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 9.30 గంటలకు మందమర్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు.
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మందమర్రికి చేరుకోనున్నారు
మందమర్రి మండలం శంకర్‌పల్లి వద్ద రూ. 500 కోట్లతో నిర్మించే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ. రూ. 40 కోట్లతో మందమర్రిలో 13 వేల గృహాలకు తాగునీరు అందించేందుకు అర్బన్ మిషన్ భగీరధ ప్రారంభం. రూ.29.68 కోట్లతో మందమర్రిలో నిర్మించిన 560 డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించనున్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ మందమర్రి మున్సిపాలిటీకి మంజూరు చేసిన రూ. 25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ. మున్సిపల్ శాఖ నుంచి మంజూరైన రూ. 20 కోట్లతో మందమర్రి మున్సిపాలిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు.
రామకృష్ణపూర్ మందమర్రి పట్టణాల మధ్య కాలినగర్ వద్ద రూ.8 కోట్లతో పాలవాగుపై నిర్మించే బ్రిడ్జికి భూమి పూజ. అక్కెపల్లిలో నిర్మించే బ్రిడ్జి, చెక్ డ్యాంలకు భూమిపూజ. అనంతరం మందమర్రి పట్టణంలో రూ. 3.3 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభం.
అనంతరం రూ. 2 కోట్లతో నిర్మించిన సమ్మక్క సారలమ్మ మహిళ భవన్, కోటి రూపాయలతో నిర్మించిన కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు. రూ.1.54 కోట్లతో నిర్మించనున్న రెండు చెక్ డ్యాంలకు శంకుస్ధాపన చేయనున్నారు.
రూ.5 లక్షలతో నిర్మించిన బతుకమ్మ గ్రౌండ్‌ను ప్రారంభించనున్నారు. రూ.22.9 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించనున్నారు. అనంతరం మందమర్రి మార్కెట్ ఏరియాలో కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొంటారు.
మందమర్రి నుంచి నేషనల్ హైవే మీదుగా క్యాతనపల్లి మున్సిపాలిటీకి చేరుకుని క్యాతనపల్లి మున్సిపాలిటీలో డీఎంఎఫ్‌టీ నిధులు రూ.40 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు.
రామకృష్ణాపూర్ పట్టణంలో రూ. 15.16 కోట్లతో నిర్మించిన 286 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. రూ.50 కోట్లతో గాంధారి వనం వద్ద 250 ఎకరాల్లో నిర్మించే కేసీఆర్ ఆర్బన్ ఏకో పార్కు పనులకు భూమి పూజ.
అనంతరం రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంలో జీవో 76 ప్రకారం సింగరేణి ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ఏడో విడత ఇండ్ల పట్టాలు పంపిణీ చేపట్టనున్నారు. అనంతరం క్యాతనపల్లిలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించనున్నారు.
మధ్యాహ్నం 1 గంట వరకు మంచిర్యాల జిల్లాలో పర్యటనను ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనకు వెళ్లనున్నారు.
