ఆఫ్ లైన్ లో వచ్చిన ఓటరు దరఖాస్తులను ఆన్ లైన్ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
శుక్రవారం సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ తో కలిసి అన్ని మండలాల తహశీల్దార్లతో ఓటరు దరఖాస్తుల ఆన్ లైన్, ధరణి, మీసేవా దరఖాస్తులు, రెండు పడక గదుల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫామ్ -6, ఫామ్ -7 దరఖాస్తుల పెండింగ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని, దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, సుమోటోగా స్వీకరించి ఏ వ్యక్తి ఓటును డిలీట్, షిఫ్టింగ్ చేయవద్దని, నోటీస్ అందించి, గడువు పూర్తయిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. పురుష, స్త్రీ ఓటరు నిష్పత్తి పెంచేలా చూడాలని, ఓటరు నిష్పత్తి తక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలను సంబంధిత ఆర్డీఓ లు క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని సూచించారు. తహశీల్దార్ లు తమ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల ప్రాధానోపాధ్యాయుల నుండి గతంలో 10 వ తరగతి పాస్ అయిన విద్యార్థుల రిపోర్ట్ తీసుకుని వారి చేత ఫామ్ -6 దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. పటిష్ట, ఆరోగ్యకరమైన ఓటరు జాబితా తయారీకి తహశీల్దార్ లు కృషి చేయాలన్నారు.
