గంభీరావుపేట మండల పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీలు, లింగన్నపేట, నర్మాల, కోళ్ళమద్ది గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల ప్రారంభానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంభీరావుపేట మండల కేంద్రంలో బీసీ కాలనీలో 168, ఎస్సీ కాలనీలో 104, లింగన్నపేట గ్రామంలో 50, నర్మాల గ్రామంలో 30, కోళ్ళమద్ది గ్రామంలో 17 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ కాలనీల్లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్లీనింగ్, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, తదితర మైనర్ రిపేర్ పనులు పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించాలని అన్నారు. త్రాగునీరు శాంపిల్ తీసుకుని టెస్టింగ్ చేయాలని, అన్ని బ్లాక్ లకు సక్రమంగా నీటి సరఫరా అవుతుందో లేదో ముందే తనిఖీ చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. కాలనీల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓ ను ఆదేశించారు.
