- పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన మైసని కుమార్ (29) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. గత కొద్దిరోజులను క్రితం నుండి కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, కుటుంబ సభ్యులతో గొడవలు పడుతుండేవాడు. ఏప్పటిలాగే ఈ నెల 5 వ తేదీన మధ్యాహ్నం మద్యం సేవించడానికి డబ్బులు కావాలని భార్య పావనితో గొడవపడగా, నా దగ్గర డబ్బులు లేవు అని పావని డబ్బులు ఇవ్వకపోయేసరికి, వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించాడు. అనంతరం కుమార్ పురుగుల మందు సేవించానని స్థానికులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వారి వ్యవసాయ పోలం వద్దకు వెళ్లి కుమార్ ని చికిత్స కోసం హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడు కుమార్ తల్లి మైసని నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.
