సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ శాఖల అధికారులందరూ స్థానికంగా అందుబాటులో ఉండి, అప్రమత్తతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
సమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణి అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని కలెక్టర్ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమాన్ని మొత్తం 12 అర్జీలు వచ్చాయి.
అనంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అలర్ట్ ఉన్న దృష్ట్యా ప్రభుత్వ శాఖల అధికారులందరూ స్థానికంగా తమ హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల ద్వారా ప్రాణ, అస్తి నష్టాలు సంభవించకుండా అప్రమత్తతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జలాశయాలు, చెరువుల నీటి మట్టాలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలని, ప్రవాహం ఉన్న ఒర్రెలు, వాగుల వద్దకు ఎవరూ రాకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు.
వర్షాల నేపథ్యంలో నీరు నిల్వ ఉండి సీజనల్ వ్యాధులు దరిచేరే అవకాశం ఉంటుందని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతీ మంగళవారం, శుక్రవారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్, పంచాయితీ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో డ్రైడే ప్రభావవంతంగా నిర్వహించేలా చూడాలని అన్నారు.
సెక్టార్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఎన్నికల నిబంధనల మేరకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలు పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధుసూదన్, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.