ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు
తిమ్మాపూర్ :
తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్ ను అనుకొని ఉన్న కాకతీయ కాలువలో ఓ హెడ్ కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. వివరాలు తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) శుక్రవారం సాయంత్రం కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లాడు. కాగా కాలువలో చేతులు కడుక్కునేందుకు మెట్ల నుంచి దిగాడు. చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని కాపాడేందుకు తాడు వేసినప్పటికీ సమయానికి అందుకోకపోవడంతో పాటు కాలువలో నీటి ప్రవాహం ఉదృతంగా ఉండడంతో కొట్టుకుపోయాడు. మల్లయ్య కరీంనగర్ భగత్ నగర్ లో నివాసం ఉంటూ హెడ్ కానిస్టేబుల్ గా పెద్దపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వద్ద మెన్ గా పని చేశాడు.సంఘటన సమాచారం తెలుసుకున్న తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలోని సిబ్బంది హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకొని మల్లయ్య ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా హెడ్ రెగ్యులేటర్ నుంచి కాకతీయ కాలువకు విడుదలవుతున్న నీటిని ఆపాలని ఎస్సారెస్పీ అధికారులకు సూచించగా నాలుగు గేట్లలో ఒకటి రాయించడంతో నీటి ప్రవాహం పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. దీంతో మల్లయ్య ఆచూకీ కనుగోనడంలో కొంత ఆలస్యం అవుతుందని సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.