దౌల్తాబాద్;
తల్లిదండ్రులు,నానమ్మ మృతి చెందడంతో నా అనేవారు లేకుండా అనాధలకు మారిన ముగ్గురు ఆడపిల్లలను అక్కున చేర్చుకొని నేనున్నానంటూ చేదోడు వాదోడుగా నిలిచారు ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్. శనివారం దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియాల్ గ్రామంలో తల్లిదండ్రుల మృతి చెందిన ఆడపిల్లలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందు ప్రియాల్ గ్రామంలో దొడ్డి రేణుక- యాదగిరి దంపతులకు శిరీష(13),శ్రావణి(8),రిషిక(6) ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వీరిది దళిత సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కుటుంబం కావడంతో వ్యవసాయ కూలి పని చేసుకుంటూ ముగ్గురు ఆడపిల్లలను పెంచి పోషించుకుంటున్నారు.2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ దొడ్డి రేణుక మృతి చెందింది. ముగ్గురు ఆడపిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఇది జరిగిన నెల రోజులకే నానమ్మ బాలఎల్లవ్వ కూడా అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుండి ఈ ముగ్గురు పిల్లలను తానే చూసుకుంటూ వారికి కనీస అవసరాలు తీర్చుకుతూ చేదోడు వాదోడుగా నిలవడం జరిగిందన్నారు. నెల రోజుల వ్యవధిలోనే తల్లి, భార్య ఇద్దరు మృతి చెందడంతో యాదగిరి తీవ్ర మానసిక వేదనకు గురై తరచూ అనారోగ్యపాలవుతున్నాడు. గత వారం రోజుల నుండి తీవ్ర ఆరోగ్యం గురై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యాదగిరి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు కనీసం వారి బాగోగులు చూసుకోవడానికి దిక్కులేని అనాధలుగా మిగిలిపోయారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్య వయసులోనే తల్లిదండ్రులు, నానమ్మ మృతి చెంది కుటుంబ సభ్యుల ప్రేమకు కరువయ్యారు.ఇలాంటి దుస్థితి ఏ పిల్లలకు రాకూడదని, వారి రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తున్నాయి. గతంలో మాదిరిగానే పిల్లలకు మరింత బాధ్యతయుతంగ సహకారం అందజేయడం ప్రస్తుతం ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు. ముగ్గురు ఆడపిల్లలను చదివించడానికి కృషి చేస్తామన్నారు. ఇంకా మానవతావాదులు ఎవరైనా ముందుకు వచ్చి ఆడపిల్లలకు అండగా నిలిచి భరోసాను కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యామల కుమార్, ఎస్ఆర్ ఫౌండేషన్ కోశాధికారి మహమ్మద్ ఉమర్,సంబగ స్వామి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
