*విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు ,మీడియాను అనుమతించొద్దని తెచ్చిన సర్కులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి..!*
*-PDSU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ డిమాండ్.*
తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఇటీవల ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలను మరియు మీడియాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని తీసుకువచ్చిన సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
అనేక ఉద్యమాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలపై స్కూల్ ఆఫ్ డైరెక్టర్ నిషేధం విధించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవసేన గారికి నిజంగా ప్రభుత్వ విద్యాసంస్థలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిని సందర్శించాలని, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన విషయాలను మరిచిపోయి అనవసరమైన విషయాలపై అధికారులకు ఈమధ్య ఆసక్తి ఎక్కువ అయిపోయిందని, బిఆర్ఎస్ కార్యకర్తలుగా అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని నెలలు కావస్తున్న మెజార్టీ పాఠశాలల విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు ,స్కూలు యూనిఫామ్స్ అందలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం విద్యార్థులకు టాయిలెట్లు, బాత్రూంలు కూడా అందుబాటులో లేవని ,వీటిపై ఆలోచించాల్సిన దేవసేన గారు విద్యార్థి సంఘాలను, మీడియాను నియంత్రించే అదనపు పని ఎందుకు చేస్తున్నారో సమాజానికి అర్థం కావట్లేదని ఆరోపించారు. తక్షణమే దేవసేన గారు ఇచ్చిన సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పీ.డీ.ఎస్.యు ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
