మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే ఉంది. ఒక అరగంట, గంట సేపు యోగా చేయండి. మీ అలసట దూరం అవుతుంది. యోగా, ప్రాణామయం ద్వారా 80 శాతం రోగాలు నయం చేసుకోవచ్చు. సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలోని బస్తీ దవాఖానలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా ఉచిత వైద్య సేవలు ప్రారంభం చేస్తున్నాం. ప్రతీ మంగళవారం ప్రత్యేకించి మహిళల కోసం ఈ వైద్య సేవలు, పరీక్షలు నిర్వహణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు కోరారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయిని తరుణి, మహిళా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్యం ఉచిత మహిళా యోగ శిక్షణ శిబిర నిర్వహణ కార్యక్రమంలో హాజరై యోగ శిక్షకులు తోట అశోక్ రూపొందించిన “వ్యాస మహర్షి యోగ – యూ ట్యూబ్ లింకు లోగో” ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం నేర్చుకుని మనదేశ యోగను చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని అన్నీ మెడికల్ కళాశాలలోని ఏంబీబీఎస్ విద్యార్థులచే నిత్యం యోగ చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా నా దినచర్య యోగతోనే ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. నిద్రలేమిని కూడా యోగ ద్వారా నయం చేయవచ్చునని, యోగ, ప్రాణాయామం ద్వారా 80 శాతం రోగాలు నయం చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు. మీ ఆరోగ్యం.. మీ చేతుల్లో ఉన్నదని రోజూ ఒక అరగంట, గంటసేపు యోగ చేస్తే మీ అలసట దూరం అవుతుందని వివరించారు. పిల్లలకు యోగ ద్వారా ఏకాగ్రత పెరుగుతున్నదని, ఒత్తిడి తగ్గిస్తుందని తెలిపారు. మీరు యోగ చేయండి.. అందరితో చేయించండని ప్రజలకు ఆరోగ్య మంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం చేపట్టినట్లు.. మహిళలు వివిధ వ్యాధులతో బాధపడుతున్న దృష్ట్యా వారి కోసం ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం వైద్య ఆసుపత్రులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ మంగళవారం ఈ వైద్య సేవలు, పరీక్షలు చేసి, అవసరమైతే మెడికల్ కళాశాలలకు పంపించి అవసరమైన పెద్ద వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు.
అనంతరం పట్టణంలోని గణేశ్ నగర్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంగళ రాంచంద్రం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు.