స్వామి వివేకానంద ఆధునిక భారతీయ ఋషి.*
*స్వామివివేకానంద మన దేశానికి నిజంగా ఒక వెలుగు.*
*భారతీయతను భారతీయ తత్వసారాన్ని అద్భుత రీతిలో పశ్చిమ దేశాల సమాజాల ముందు ఆవిష్కరించారు.*
ఆయన అసలు పేరు *నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12 వ తేదీన కలకత్తాలో జన్మించాడు.* తండ్రి విశ్వనాథ్ దత్తా ప్రముఖ న్యాయవాది. తల్లి భువనేశ్వరి దేవి. యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఆయన పుట్టినరోజునే ‘జాతీయ యువజన దినోత్సవంగా’ కూడా జరుపుకుంటున్నారు. కన్నతల్లి ఒడిలోనే వేదాలు, పురాణాలలో ఉన్న నీతిని నేర్చుకున్నాడు వివేకానంద.
రామకృష్ణ పరమహంస శిష్యునిగా మంచి పేరును సంపాదించుకోవడమే కాకుండా గురుశిష్యుల బంధానికి ఒక ప్రతీకగా నిలిచాడు ఆయన. గురువు పేరు మీదుగా ‘రామకృష్ణ మఠం’ స్థాపించాడు. ఈ మఠం ద్వారా నేడు ఆనేక మంది యువకులు వివిధ భాషల పరిజ్ఞానాన్ని ఉచితంగా నేర్చుకుంటున్నారు. చిన్నతనం నుంచి మంచి విద్యార్ధిగా అందరి మెప్పునూ పొందిన వివేకానందుడు ఎప్పుడూ క్లాసులో మంచి మార్కులతో ఫస్ట్ గా నిలిచేవాడు.
ఒకాసారి జాగ్రఫీ మాస్టారు అడిగిన ప్రశ్నకు వివేకానంద సరియైన సమాధానాన్ని చెప్పి కూడా శిక్షను అనుభవించాడు. మాష్టారు తాను తప్పుగా భావించి దానికి శిక్ష విధించారు. క్లాసులోనే అందరి ముందు ‘సార్ మీరు ఏ శిక్ష వేసినా సరే, నేను చెప్పిన సమాధానం సరైనదే. నేను ఏ తప్పూ చేయలేదు.’ అంటూ బిగ్గరగా చెప్పాడు. బాలుడిగా వివేకానంద చెప్పిన ఆ మాటలకు, ధైర్యానికి, ఒక్కసారిగా ఆ మాష్టారు ఆశ్చర్యపోయారు. వివేకానంద స్కూలు అయిన వెంటనే ఇంటికి వచ్చి ఏడుస్తూ అమ్మతో జరిగిన విషయాన్ని చెప్పాడు. దానికి తల్లి భువనేశ్వరి దేవి ‘బాబూ నువ్వు చెప్పింది నిజమేనని నీ మనసుకు పూర్తిగా తెలుసు. నిజానికి ఎంత శక్తి అయితే ఉందో, దానివలన అన్ని కష్టాలూ, సమస్యలూ కూడా వస్తాయి. వాటికి భయపడకూడదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిజాన్నే నమ్ముకో’ అంటూ ఓదార్చింది. స్వామి వివేకానంద తన ఉపన్యాసాలతో మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేశారు. అయితే చిన్నతనం నుంచే వివేకానందుడు ఎంతో బాగా మాట్లాడేవాడు అనడానికి ఒక చక్కని ఉదాహరణ ఏమిటంటే, ఒకసారి వివేకానందుడు క్లాసులో మాష్టారు లేని సమయంలో చుట్టూ ఉన్న స్నేహితులకు ఏదో ఒక విషయం గురించి వివరిస్తున్నాడు. అంతలో మాష్టారు పాఠం చెప్పడానికి వచ్చి, తోటి విద్యార్థులు అంతా వివేకానందుడు చెప్పేది శ్రద్దగా వినటం గమనించారు. వివేకానంద మాష్టారు వచ్చిన విషయాన్ని గమనించలేదు. ఆ మాష్టారు వివేకానందుడు ఏం చెబుతున్నాడని ప్రతి పిల్లవాడిని అడగగా వాళ్ళు ఒక్క విషయం కూడా వదలకుండా మాష్టారుకి వివరించేసరికి ఆయన ఆశ్చర్యపోయారట. దానితో వివేకానందలో ఉన్న వాక్పటిమను మాష్టారు గమనించటమే కాదు, వివేకానందుని మాటల్లో అయస్కాంత శక్తి ఉందని ప్రశంసించారు. 1877-1879 తండ్రితో రాయపూరులో ఉన్నాడు.. దక్షిణేశ్వరం – కాళికాలయంలో పూజారి శ్రీ రామకృష్ణుని కలుసుకోవడం, ప్రియశిష్యునిగా మారడం జరిగింది. 1897 మే1 న శ్రీ రామకృష్ణ మిషన్ స్థాపన చేశాడు. 1891లో భారతయాత్ర చేశాడు. 11.9.1893 తేదీన చికాగో విశ్వమత మహాసభలో ఉపన్యసించి విశ్వ విఖ్యాతి చెందాడు.
*స్వామి వివేకానంద యొక్క ఉపన్యాసాలను బోధనలను విన్న విదేశీయులు అందరూ కూడా భారతీయ సంస్కృతి ,సాంప్రదాయాల పట్ల బాగా ఆకర్షితులు అయ్యారు.*