ప్రాంతీయం

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి:: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*

153 Views

33% ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి సంవత్సరం అమలు*

-మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ప్రజా ప్రతినిధులతో కలెక్టర్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు*

-ప్రతి మండలానికి ఇంజనీరింగ్ విభాగాన్ని కలెక్టర్ నియమించాలి*

-ప్రతిమాసం మన ఊరు మన బడి కి నిధుల విడుదల*

-ఉపాధిహామీ నిధులను విస్తృతంగా వినియోగించాలి*

-పాఠశాలల అభివృద్ధికి దాతల నుంచి నిధుల సేకరణ*

-మన ఊరు మనబడి కార్యక్రమం అమలు పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విద్యా శాఖ మంత్రి*

రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 12

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖామాత్యులు టి. హరీష్ రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన రామకృష్ణారావు, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఏ. శ్రీదేవసేన, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ డా. ఏ. శరత్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లతో మన ఊరు – మన బడి/ మన బస్తి – మన బడి కార్యక్రమం అమలుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌళిక సదుపాయాల కల్పన కోసం విద్యాశాఖలో మన ఊరు – మన బడి/ మన బస్తి – మన బడి అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో కలెక్టర్లు, అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అదే విధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పేద, మధ్య తరగతుల విద్యార్థుల సౌకర్యార్థం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో మొదటి దశలో మండల కేంద్రాన్ని యూనిట్ గా తీసుకుని అన్ని రకాల (ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో) అత్యధికంగా ఎన్ రోల్మెంట్ అయిన 33% పాఠశాలలను అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి సౌకర్యంతో టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యం, విద్యుదీకరణ, విద్యార్థులకు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్ , పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మరమ్మతులు చేయడం, గ్రీన్ చాక్ బోర్డ్ లు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, శిధిలమైన గదుల స్థానంలో కొత్త గదులను ఏర్పాటు చేసుకోవడం, డైనింగ్ హాల్, డిజిటల్ విద్య అమలు అంశాలను పరిగణలోనికి తీసుకోవాలన్నారు. పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు, గ్రామస్థుల భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలన్నారు. సోమవారం నుండి శనివారంలోగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో, సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఒకే ప్రాంగణంలో ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు సైతం రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రూ. 7289 కోట్లతో మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమ అమలుకు జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం అందిస్తుందని, పాఠశాలలో చేపట్టే వివిధ పనులకు పరిపాలన అనుమతులు కలెక్టర్లు అందజేయాలని మంత్రి పేర్కొన్నారు. గతంలో రైతు వేదికలు, డంపింగ్ యార్డ్ ల నిర్మాణాలు పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు, ప్రతి మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఏజెన్సీ లను ఏర్పాటు చేయాలన్నారు. ఒక మండలానికి ఒక ఏజెన్సీని కేటాయించి పనులు నాణ్యతగా, వేగవంతంగా చేపట్టే విధంగా చూడాలన్నారు. అత్యధికంగా విద్యార్థుల ఎన్ రొల్మెంట్ ఉన్న పాఠశాలలను గుర్తించి మొదటి సంవత్సరం వాటిలో అభివృద్ధి పనులు చేపడతున్నామని, 60% విద్యార్థులు మొదటి సంవత్సరం లోనే లబ్ధి పొందుతారని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందించే రూ. 5 కోట్ల నిధులలో రూ. 2 కోట్లు, జిల్లా పరిషత్తులకు అందించే 500 కోట్లలో 250 కోట్ల నిధులు, నాబార్డు నిధులు, ఉపాధి హామీ నిధులు, ప్రభుత్వ ప్రత్యేక గ్రాంట్ నిధులు వినియోగిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. విద్యా శాఖ ఎంపిక చేసిన పాఠశాలలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు అందించిన ప్రతిపాదనలు ధృవీకరించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడైతే భవనాలకు మరమ్మతులు చేయవచ్చో అక్కడ మరమ్మతులు చేయాలని, పూర్తిగా కూల్చరాదని, శిధిలావస్థలో ఉన్న వాటిని పూర్తిగా తొలగించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ లు సంబంధిత పాఠశాలను సందర్శించి ఏ పనులు చేపట్టాలి అనే విషయంపై ప్రాధాన్యత క్రమంలో గుర్తించాలను, అంచనాలను తయారుచేయాలని, అవసరం మేరకే నిధులు ఖర్చు చేయాలని, అనవసరమైన ఖర్చులు దుబారా ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒకే కలర్ వేయాలని, ఏ రంగు వేయాలి అనే విషయంపై ప్రభుత్వం నుండి స్పష్టత ఇస్తామన్నారు. ప్రతి పని విషయం పై స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించుకుని ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ ను నాణ్యతగా ఉండే విధంగా చూడాలని, ఇట్టి పనుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆదేశాలను పాటించాలన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం జిల్లాలో దాతలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని, ప్రముఖులు, ఎన్ఆర్ఐ లు, ప్రజలు, పూర్వ విద్యార్థుల నుంచి సహకారం అందించే పక్షంలో వారి సహకారాలను తీసుకోవాలన్నారు. రూ.10లక్షలు దానం అందిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షలు దానం అందిస్తే బ్లాక్ కు, రూ. కోటి దానం అందిస్తే పాఠశాలకు దాతల పేర్లు పెట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కార్యక్రమం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే రోజు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గ్రౌండింగ్ చేయాలని అన్నారు. గ్రామాల్లో చేపట్టే మన ఊరు-మన బడి కింద చేపట్టే పాఠశాలలో ప్రహరీ గోడ ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణం, కిచెన్ షెడ్స్ ఏర్పాటుకు ఉపాధి హామీ నిధులు ద్వారా పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా మరియు వేగంగా అమలు చేయడం కోసం పాఠశాల నిర్వహణ కమిటీలకు బాధ్యతలు అప్పగించాలని మంత్రి ఆదేశించారు. 30 లక్షల వరకు పనులను కలెక్టర్ నామినేషన్ పద్ధతిలో అందించవచ్చని మంత్రి పేర్కొన్నారు. మన ఊరు – మన బడి పేరు మీద జిల్లా కలెక్టర్లు ప్రత్యేక బ్యాంకు ఖాతా ప్రారంభించాలని, అదేవిధంగా మొదటి సంవత్సరం ఎంపిక చేసిన ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ రెండు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం అందించే నిధులను జిల్లా కలెక్టర్ సంబంధిత పాఠశాల నిర్వహణ కమిటీ బ్యాంక్ ఖాతాలు జమ చేయాలని, దాతల నుండి వచ్చే సొమ్ము రెండవ పాఠశాల నిర్వహణ కమిటీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాల నిర్వహణ కమిటీ దాతల బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని, పాఠశాల అభివృద్ధి కోసం ఎవరైనా సదరు ఖాతాలో తమ శక్తి మేరకు జమ చేయవచ్చని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి పాఠశాల పరిధిలో తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులతో పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చేపట్టే అభివృద్ధి పనులు గురించి వివరించాలని మంత్రి తెలిపారు.
జిల్లాలో పెండింగ్ కరోనా వ్యాక్సినేషన్, 15-17 వయస్సు వారికి వాక్సిన్, బూస్టర్ డోస్ పూర్తి అయ్యేటట్లు చూడాలని, అలాగే పెండింగ్ ఆడిట్ పేరాలు తొలగి పోయి విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా విద్యాధికారి డా. రాధాకిషన్, డీఆర్డీఓ కె. కౌటిల్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7