నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలంతో ప్రశ్నించిన నికార్సైన కలంవీరుడు షోయబుల్లాఖాన్. నేటి జర్నలిస్టులకు షోయబుల్లాఖాన్ ఎంతో స్ఫూర్తిదాయకమని రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం ప్రెస్ క్లబ్ లో షోయబుల్లాఖాన్ 104 వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపనతో షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకొని మొదట షోయబ్ ‘తేజ్ ‘అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, అతని తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు. తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు. పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది. తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడిందన్నారు. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాసిన అక్షర వీరుడన్నారు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరని పేర్కొన్నాడు. ‘పగటి ప్రభుత్వం – రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించిన ధైర్యశీలి షోయబుల్లాఖాన్. అలాంటి కలం వీరుడినీ నేటి జర్నలిస్టులు స్ఫూర్తిదాయంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి నర్సింలు, జర్నలిస్టు సభ్యులు మన్నె గణేష్, కనుక స్వామి, ప్రజా సంఘాల నాయకులు లింగం, శ్రీకాంత్, నవీన్, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
