స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్*
రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09
గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, బొప్పాపూర్, ముస్తాబాద్ మండలం చిప్పలపెల్లి, మద్దికుంట, మోహినికుంట గ్రామాల్లో పర్యటించి సీసీ రోడ్లు, గ్రామ పంచాయితీ భవన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెంకటాపూర్ గ్రామంలోని రెండు పడక గదుల ఇండ్ల కాలనీలో 15 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, బొప్పాపూర్ గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయితీ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. ముస్తాబాద్ మండలం చిప్పలపెల్లి రెండు పడక గదుల ఇండ్ల కాలనీలో నిర్మాణ ప్రగతిలో ఉన్న సీసీ రోడ్లు, మద్దికుంట గ్రామంలోని సీసీ రోడ్లు, మోహినికుంట గ్రామంలోని సీసీ రోడ్లు, మురికికాలువల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల ప్రగతిపై అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు.
ఈ పరిశీలనలో డీఆర్డీఓ కె. కౌటిల్య, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, అడిషనల్ డీఆర్డీఓ మదన్ మోహన్, ఎంపీడీఓ లు చిరంజీవి, రమాదేవి, తదితరులు ఉన్నారు.
