Breaking News

త్వరలో ఫోన్‌ నంబరుకూ ఫీజు..

66 Views

జూన్ 14, 24/7 తెలుగు న్యూస్:వినియోగదారులకు షాక్‌..
త్వరలో ఫోన్‌ నంబరుకూ ఫీజు..

నంబర్లు ‘పరిమితమైన వనరులు’
వీటి చార్జీలు వసూలు చేయాలి
వినియోగించని నంబర్లపై జరిమానా విధింపు
ట్రాయ్‌ కొత్త ప్రతిపాదనలు

మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు త్వరలోనే షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఫోన్‌ నంబరు కలిగి ఉన్నందుకు కూడా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) కొత్త ప్రతిపాదనలు చేసింది. మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ నంబర్లు కూడా పరిమితమైన, విలువైన ప్రజా వనరులేనని, కాబట్టి వీటిపై ఫీజు వసూలు చేయాలని ట్రాయ్‌ భావిస్తున్నది. ఈ మేరకు జూన్‌ 6న విడుదల చేసిన ప్రతిపాదన పత్రంలో ఈ ఫీజుల ప్రతిపాదనను పొందుపరిచింది. అయితే, టెలికం ఆపరేటర్ల నుంచి ఈ ఫీజులు వసూలు చేయాలని ట్రాయ్‌ భావిస్తున్నది.

టెలికం ఆపరేటర్లు ఈ భారాన్ని వినియోగదారులపైనే మోపుతారు. నంబర్లకు ఫీజులు విధించడం ద్వారా ఈ పరిమితమైన వనరులను సక్రమంగా కేటాయించే అవకాశం ఉంటుందని ట్రాయ్‌ చెప్తున్నది. గత ఏడాది డిసెంబరులో ఆమోదం పొందిన కొత్త టెలికం చట్టం సైతం ఫోన్‌ నంబర్లపై చార్జీలు వసూలు చేసేందుకు అనుమతిస్తున్నది. ఎలాగైతే స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం కేటాయిస్తుందో అలాగే నంబరింగ్‌ స్పేస్‌పై కూడా యాజమాన్య హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ట్రాయ్‌ చెప్తున్నది.

వినియోగంలో లేని నంబర్లపై ఆపరేటర్లకు జరిమానా
ఫోన్‌ నంబర్లకు ఫీజు వసూలు చేసేందుకు పలు పద్ధతులను ట్రాయ్‌ సూచించింది. ఒకేసారి ఒక్కో నంబరుపై కొంత మొత్తం ఛార్జీ వసూలు చేయడం, ఏటా కొంత ఫీజు తీసుకోవడం, ప్రీమియం, వీఐపీ నంబర్లకు మాత్రమే కేంద్రీకృత వేలం నిర్వహించడం వంటి మార్గాల్లో ఏదో ఒకటి అవలంబించొచ్చని ట్రాయ్‌ పేర్కొన్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్‌, బెల్జియం, యూకే, ఫిన్లాండ్‌, హాంకాంగ్‌, కువైట్‌, స్విట్జర్లాండ్‌, దక్షిణాఫ్రికా, డెన్మార్క్‌ తదితర దేశాల్లో ఫోన్‌ నంబర్లపై ఫీజులు వసూలు చేసే విధానం ఉంది. కాగా, వినియోగంలో లేని నంబర్లపై టెలికం ఆపరేటర్లకు జరిమానా విధించే అంశాన్ని కూడా ట్రాయ్‌ పరిశీలిస్తున్నది.

నంబర్లు కొన్ని నెలల పాటు వినియోగంలో లేకపోయినప్పటికీ వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు ఆ నంబర్లను టెలికం ఆపరేటర్లు రద్దు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఫోన్‌ నంబర్లు నిరుపయోగంగా మారుతున్నందున వీటిపై టెలికం ఆపరేటర్లకు జరిమానా విధించే ఆలోచనతో ట్రాయ్‌ ఉంది. వీటితో పాటు మొబైల్‌ కంట్రీ కోడ్‌లు(ఎంసీసీ), మొబైల్‌ నెట్‌వర్క్‌ కోడ్‌లు(ఎంఎన్‌సీ) కేటాయించడంపై కూడా ట్రాయ్‌ దృష్టి సారించింది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా భాగస్వామ్యపక్షాలకు ట్రాయ్‌ జూలై వరకు అవకాశం ఇచ్చింది.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal