జూన్ 14, 24/7 తెలుగు న్యూస్: ఐఎఎస్‌లు లేరు…
దేశవ్యాప్తంగా 1,365 ఖాళీలు
యుపిఎస్‌సి నియామకాలపై కేంద్రం ఆంక్షలు
సంఖ్య పెంచాలని సిఫారసు చేసినా మౌనం
టచ్ ఉన్న రిటైర్డ్ అధికారులతో ఖాళీల భర్తీ
న్యూఢిల్లీ : ఐఎఎస్ అధికారుల నియామకాలను పెంచాలని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖ తన ఆంతరంగిక నివేదికలో అభిప్రాయపడింది. ఐఎఎస్ అధికారుల నియామకాలను ఏడాదికి 180 నుంచి 210-220కి పెంచాలని సిఫారసు చేసింది. ‘ఐఎఎస్ అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం చాలా కాలం నుండే ఉంటోంది. ప్రతి సంవత్సరం అదనంగా మరో 30-40 మందిని యుపిఎస్‌సి నియమించాలని నివేదిక సిఫారసు చేసింది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారి ఒకరు ‘ది ప్రింట్’ పోర్టల్‌కు తెలిపారు. సిబ్బంది-శిక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపిఎ) సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.
జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. 2014 తర్వాత దేశంలో మరో వందకు పైగా జిల్లాలు ఏర్పడ్డాయి. అక్కడ సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఖాళీలన్నీ భర్తీ చేసే వరకూ పది సంవత్సరాల పాటు ఏడాదికి 30 మంది కొత్త ఐఎఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రభుత్వాధికారి వివరించారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 1,365 ఐఎఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా 180 మంది అధికారులను మాత్రమే యుపిఎస్‌సి నియమించాలని ప్రభుత్వం 2012 నుంచి ఆంక్షలు విధించింది.
ప్రతి ఏటా నియమించే ఐఎఎస్ అధికారుల సంఖ్యను పెంచే యోచన ఏదీ లేదని గత ప్రభుత్వంలో సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన జితేంద్రసింగ్ 2023లో పార్లమెంటుకు తెలియజేశారు. అధికారుల నియామకాలు పెంచితే నాణ్యతలో రాజీ పడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అయితే ఖాళీల సంఖ్య అధికంగా ఉన్నందున నియామకాలను చేపట్టే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయవచ్చునని ప్రభుత్వాధికారి చెప్పారు. వీటికి అదనంగా డిప్యూటీ సెక్రెటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రెటరీ స్థాయిలో లేటరల్ ఎంట్రీ ద్వారా నియామకాలు జరిపేందుకు రంగం సిద్ధమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి 51 పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
2018-2023 మధ్యకాలంలో అఖిల భారత సర్వీసుల్లో (ఎఐఎస్) ఖాళీల భర్తీకి ప్రయత్నాలు జరిగాయి. ఈ కాలంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా జరిపిన నియామకాలు 812 నుంచి 1143కు పెరిగాయి. 2021లో 749 మంది అధికారులను మాత్రమే నియమించారు. ఇక ఐపిఎస్ అధికారుల విషయానికి వస్తే 2019లో 150 మందిని నియమించగా 2020 నుంచి ప్రతి ఏటా 200 మంది అధికారులను నియమించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో కూడా అధికారుల నియామకాలు పెరిగాయి.