జూన్ 8, 24/7 తెలుగు న్యూస్:చెక్కు చెదరని ఫెడరలిజం.
దేశంలో ఫెడరలిజం చెక్కు చెదరకపోవటం ప్రస్తుత లోక్‌సభ ఫలితాలు తేల్చిచెప్పిన ముఖ్యాంశాలలో ఒకటి. ఫెడరలిస్టు పార్టీల బలం రాష్ర్టాల వారీగా చూస్తే కొన్నిచోట్ల తగ్గవచ్చు. కాని దేశం మొత్తం మీద చూసినప్పుడు 2019 కన్న 2024లో మరింత పెరిగిందన్నది గమనించదగిన విశేషం. బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రమే జాతీయ పార్టీలు కాగా వాటి ఉమ్మడి బలం 2019లో 303+52= 355 నుంచి ఈసారి 240+99=339కి పడిపోయింది.
మొత్తం 543 మంది సభ్యుల సంఖ్య గల లోక్‌సభలో ఇతర పార్టీల బలం 188 నుంచి 204కు పెరిగింది. మొదటిసారి 1977లో జనతా పార్టీ పేరిట ఫెడరల్ శక్తుల కూటమి కేంద్రంలో అధికారానికి వచ్చినప్పటి నుంచి, తర్వాత 47 సంవత్సరాల పాటు మధ్య మధ్య చిన్నపాటి వ్యవధులతో ఫెడరల్ శక్తులు ప్రభుత్వాల ఏర్పాటుకు కీలకం అవుతూనే వస్తున్నాయి. ఇప్పుడు 2024లో కనిపిస్తున్నది కూడా అదే.
ఈ ఎన్నికలలో ప్రధాని మోదీ నాయకత్వాన బీజేపీకి సొంత బలం 303 నుంచి 240కి పడిపోగా, మరొక 53 స్థానాలతోప్రాంతీయ పార్టీలు అండగా నిలవకపోతే బీజేపీ మరొకసారి అధికారానికి రాగల అవకాశమే ఉండేది కాదు. అదేవిధంగా, ఇండియా కూటమికి 234 స్థానాలు రాగా, అందులో కాంగ్రెస్‌వి 99 మాత్రమే. తక్కిన 135 ఫెడరల్ శక్తులవి కావటం గుర్తించదగ్గది.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఏకచ్ఛత్రాధిపత్యం మినహా ఫెడరల్ శక్తులంటే ఎంతమాత్రం సరిపడే విషయం కాదు. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ అయితే అసలు ప్రాంతీయ పార్టీలకు, భాషా ప్రయుక్త రాష్ర్టాలకు వ్యతిరేకంగా సిద్ధాంతీకరించింది కూడా. తమకు మెజారిటీ లభించనప్పుడు విధి లేక ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవటం, లేదా మెజారిటీ రాగల అవకాశం లేదని గ్రహించినప్పుడు ఎన్నికలకు ముందే అవగాహనకు రావటం అయితే చేస్తున్నారు గాని, ఆ తర్వాత ఫెడరల్ పార్టీలను చీల్చటానికి, తమలో కలుపుకోవటానికి, అణచివేయటానికి రకరకాల ప్రయత్నాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీ అనే రెండు సెంట్రలిస్టు, యూనిటరిస్టు, జాతీయపార్టీల మధ్య ఎటువంటి తేడా లేదు. ఇందుకు ఎన్నెన్ని ఉదాహరణలనైనా ఇవ్వవచ్చు.
ప్రాంతీయ శక్తులు, వాటికి ప్రాతినిధ్యం వహించే ఫెడరలిస్టు పార్టీలు ఈ ప్రయత్నాలన్నింటిని తట్టుకుంటూ 47 సంవత్సరాల తర్వాత ఈ 2024 ఎన్నికల నాటికి కూడా నిలిచి ఉండటం, తద్వారా దేశంలో ఫెడరలిస్టు ధోరణులను సజీవంగా ఉంచటం మన దేశ ప్రజాస్వామ్యంలో ఒక గమనార్హమైన స్థితి. ఈ ఎన్నికలలో ప్రధాని మోదీ నాయకత్వాన బీజేపీకి సొంత బలం 303 నుంచి 240కి పడిపోగా, మరొక 53 స్థానాలతో ప్రాంతీయ పార్టీలు అండగా నిలవకపోతే బీజేపీ మరొకసారి అధికారానికి రాగల అవకాశమే ఉండేది కాదు. అదేవిధంగా, ఇండియా కూటమికి 234 స్థానాలు రాగా, అందులో కాంగ్రెస్‌వి 99 మాత్రమే. తక్కిన 135 ఫెడరల్ శక్తులవి కావటం గుర్తించదగ్గది. ఇందులో మరొక విశేషం ఉన్నది.
కాంగ్రెస్ బలం 2019 నాటి 52 కన్న దాదాపు రెట్టింపు అయిందని పలువురు ఆ పార్టీని, పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీని పొగుడుతున్నారు గాని, ఆ 99లో సుమారు 40 ఆయా రాష్ర్టాలలోని ఫెడరల్ పార్టీలతో పొత్తుల వల్ల గెలిచినవి మాత్రమే. అనగా ఒంటరిగా బలం పెంచుకున్నది దాదాపు శూన్యం. యూపీ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు మొదలైన చోట్ల పొత్తులు లేనట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఎవరైనా ఊహించవచ్చు. అదే పద్ధతిలో బీజేపీ అనే మరొక జాతీయ పార్టీకి కూడా ఇంతకాకున్నా ఒక మేరకు, ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాల వల్లనే 240 స్థానాలు లభించాయి. రెండు జాతీయ పార్టీల బలాబలాలను విశ్లేషించినట్లయితే, అదేవిధంగా ఫెడరల్ పార్టీలు గెలుచుకున్న 204 సీట్లను (ఎన్డీయేలోని 53, ఇండియా కూటమిలోని 135, ఏ కూటమిలో లేని పార్టీలు, వ్యక్తులు కలిపి 16) చూసినట్లయితే పరిస్థితి ఏమిటో బోధపడుతుంది.
ఫలితాలలో మరికొన్ని విశేషాలను గమనించినప్పుడు, జాతీయ పార్టీలనబడేవాటి పరిమితులు ఏమిటో, ఫెడరల్ శక్తుల బలమేమిటో మరికొంత అర్థమవుతుంది. ముందుగా ఇండియా కూటమిని చూద్దాము. ఆ కూటమిని ఏర్పాటుచేసే క్రమంలో సమాజ్‌వాదీ, తృణమూల్, ఆప్, ఎన్సీపీ (పవార్) వంటి పార్టీలతో కాంగ్రెస్ సంబంధాలు సాఫీగా ఏమీ సాగలేదు. సమాజ్‌వాదీ దాదాపు దూరమైనంత పని కాగా, తృణమూల్ ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్ ఆధిపత్య ధోరణిని ఆ విధంగా ధిక్కరించి కూడా అవి గొప్ప ఫలితాలు సాధించాయి. మరొకవైపు టీడీపీ, జనసేన కలిసిరానట్లయితే బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా గెలవడమంటూ గాని, ఆ రెండు పార్టీల 18 స్థానాలు తోడవటం గాని ఉండేవి కాదు. అప్పుడు ఎన్డీయే బలం కనీస మెజారిటీ అయిన 272 దగ్గర బొటాబొటిగా ఆగిపోయేది.
దీనంతటిలో పాఠమేమంటే, ఇండియా వంటి మహా వైవిధ్యత గల దేశంలో జాతీయతకు, ఫెడరలిజానికి మధ్య సమతులనమన్నది ఒక తప్పనిసరి అవసరం. జాతీయపార్టీల అవసరమే లేదనటం ఎంత పొరపాటు అవుతుందో ఫెడరల్ పార్టీలకు కాలం చెల్లిందని గాని, చెల్లుతుందని గాని భావించటం అంతే పొరపాటవుతుంది. జాతీయత ఒక జాతిగా ఈ దేశ అవసరం. ఫెడరలిజం ఒక వైవిధ్య వ్యవస్థగా మన సమాజ అవసరం. ఈ రెండింటిని కూడా మన స్వాతంత్య్రోద్యమ నాయకులైన మహా మేధావులు, దార్శనికులు లోతుగా అధ్యయనం చేసినందువల్లనే, దేశ దీర్ఘకాలిక భవిష్యత్తును అన్ని కోణాల నుంచి దృష్టిలో ఉంచుకుంటూ రెండు కీలకమైన మాటలన్నారు. బలమైన కేంద్రం, బలమైన రాష్ర్టాలన్నది ఒకటి. వాటి మధ్య సహకార ఫెడరలిజమన్నది రెండు. రాజ్యాంగాన్ని, చట్టాలను, పంచవర్ష ప్రణాళికలను, కేంద్ర ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం, నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర కౌన్సిల్ వంటి వ్యవస్థలను అందుకు అనుగుణంగానే రూపొందించారు. ఆ విధంగా దేశాన్ని ప్రపంచానికే ఆదర్శవంతం చేయబూనారు.
తొలిదశ తర్వాత వచ్చిన పాలకులు, పార్టీలు అందుకనుగుణంగా వ్యవహరించి ఉంటే దేశం అద్భుతంగా రూపుదిద్దుకొని ఉండేది. కాని వారి స్వార్థాలు, వైఫల్యాల వల్ల ఒకవైపు ఈ లక్ష్యాలు దెబ్బతింటూ పోగా, దాని పర్యవసానంగా ప్రాంతీయ శక్తులు బలోపేతం కావటం, యూనిటరిస్టు శక్తులకు, వాటి వక్రీకృత జాతీయతకు ఆ ప్రాంతీయ శక్తులతో ఘర్షణ తలెత్తటం మొదలైంది. జాతీయత పేరిట అధికారాన్ని తమ చేతిలో కేంద్రీకృతం చేసుకోవటంలో, రాష్ర్టాల హక్కులను హరించటంలో, ధనిక వర్గాల కోసం అంతర్గత వలసలను, అసమానతలను ప్రోత్సహించటంలో మొదట కాంగ్రెస్, తర్వాత బీజేపీ ఒకదానికొకటి తీసిపోలేదు. ఆ క్రమంలో వారిద్దరు అన్ని రాజ్యాంగ వ్యవస్థలను సైతం బలహీనపరిచారు. అయినప్పటికీ, ఈ దేశ వైవిధ్యతలే, ప్రజల ఆకాంక్షలే తమ అంతర్నిహితమైన మౌలిక బలంగా గల ఫెడరల్ శక్తులు అన్ని ఒడిదుడుకులను తట్టుకుంటూ నిలబడుతున్నాయనటానికి ఈ 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, అందులో ప్రతిఫలిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ల బలహీనతలు ఒక తిరుగులేని రుజువు.
ఇక్కడినుంచి బయలుదేరి భవిష్యత్తు విషయానికి వస్తే, తమకు, ఎదురులేదనే అహంకారాన్ని మోదీ, బీజేపీ, సంఘ్‌పరివార్‌లు వదులుకోవాలి. తమకు వచ్చిన 99 సీట్లు తమ ఘనత అనే మిడిసిపాటును రాహుల్, కాంగ్రెస్‌లు మానుకోవాలి. వరుసగా మూడుసార్లు అధికారం కోల్పోయి 99 సీట్లలో చాలా భాగం ఇతర మిత్రపక్షాల చలవ అయినందున అహంకరించవలసిందేమీ లేదు. ఆ తర్వాత తమ వైఫల్యాలపై సీరియస్‌గా, నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఇక ఫెడరలిజం విషయానికి వస్తే, ఈ దేశ వైవిధ్యతను, ఫెడరల్ శక్తుల పాత్రను, వాటిని ప్రతిబింబించే రాజ్యాంగాన్ని, పైన పేర్కొన్న వివిధ వ్యవస్థలను గుర్తించి, గౌరవించి, అందుకు బద్ధులై తీరాలి. ప్రాంతీయ పార్టీలన్నవి తమకు నచ్చినా, నచ్చకపోయినా ఒక శిలాశాసనం వంటి, వేదవాక్కు వంటి వాస్తవం. వాటిని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాము, అవసరం తీరినాక కబళించ జూస్తామనే ధోరణిని శాశ్వతంగా వదిలివేసి, ఈ దేశాన్ని నడిపించటంలో అవి తమతో పాటు భాగస్వాములనే వైఖరిని తీసుకోవాలి.