జూన్ 8, 24/7 తెలుగు న్యూస్: తీరం… ప్రమాదకరం…
కోతకు గురవుతున్న కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డు
సముద్రంలో కలుస్తున్న వందల మత్య్సకారుల గృహాలు
తీర ప్రాంత రక్షణకు నూతన ప్రభుత్వంపై ఆశలు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :ఇటీవల తుపాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ-కాకినాడ మధ్య సముద్ర తీర ప్రాంతం మరోసారి అతలాకుతలమైంది. బీచ్ రోడ్డు కోతకు గురైంది. తీర ప్రాంతంలోని ఆరుగురు మత్స్యకారుల గృహాలు దెబ్బతిన్నాయి. తుపానులు, అల్పపీడనాలు ఏర్పడినప్పుడల్లా కెరటాల తాకిడితో తీర ప్రాంతం కోతకు గురవుతూనే ఉంది. దీంతో, మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ‘జియో ట్యూబ్’ టెక్నాలజీతో తీరప్రాంత రక్షణకు ఏర్పాటు చేసిన బండరాళ్లు ఐదేళ్ల క్రితం పూర్తిగా ధ్వంసమయ్యాయి. తీరప్రాంత రక్షణకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదే పదే చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడనుండడంతో పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్ తీర ప్రాంత రక్షణకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఐదేళ్ల క్రితం ధ్వంసమైన ‘జియో ట్యూబ్’ టెక్నాలజీ
2004 డిసెంబర్‌లో వచ్చిన సునామీ కారణంగా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమై పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. 2005 మార్చిలో కోటి రూపాయల నిధులతో ఉప్పాడ శివారు కొత్తపట్నం నుంచి బర్మా కాలనీ వరకూ 200 మీటర్ల పొడవున ఆర్ అండ్ బి అధికారులు పెద్ద పెద్ద బండరాళ్లను వేశారు. అయినా సముద్రపు కోతను నివారించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అప్పటి కేంద్రం మంత్రి ఎంఎం.పళ్లంరాజు సహకారంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రూ.14 కోట్లు ఖర్చు చేసి 1.53 కిలోమీటర్ల పొడవున 2007లో జియోట్యూబ్‌ను ఏర్పాటు చేసి కోతను నివారించగలిగారు. గతంలో ఖైముక్, నీలం వంటి తుపానులను నుంచి తీరప్రాంతాన్ని ఇది రక్షించిందని మత్య్సకారులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడంతో ఐదేళ్ల క్రితం జియో ట్యూబ్ పూర్తిగా ధ్వంసమైంది. బండరాళ్లన్నీ సముద్రంలో కలిసిపోయాయి. తుపాను, అల్పపీడనం సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారి తీరప్రాంతం కోతకు గురవడం సర్వసాధారణమైంది. పేతారు, తిత్లీ, ఫణి, హెలిన్ తుపానుల సమయంలో ఉప్పాడ, కోనపాపపేట, సూరాడపేట తదితర గ్రామాల్లో వందలాది ఇల్లు నేలమట్టమయ్యాయి. గడిచిన 52 ఏళ్లలో కిలోమీటరు కంటే ఎక్కువగా తీరప్రాంతం ముందుకు చొచ్చుకు వచ్చింది. దాదాపు 15 వందల ఇళ్లు, దేవాలయాలు, ప్రభుత్వ భవనాలు పూర్తిగా సముద్రÛంలో కలిసిపోయాయని, 500 ఎకరాల పైబడి వ్యవసాయ భూమిని పూర్తిగా సముద్రంలో కలిసిపోయిందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.
బీచ్ రోడ్డు రక్షణకు ముప్పు
కాకినాడ నుంచి ఉప్పాడ వరకు సుమారు 15 కిలోమీటర్ల పొడవునా బీచ్ రోడ్డు ఉంది. రామయ్యపట్నం నుంచి కాకినాడ వైపు బీచ్ రోడ్డు గుండా సుమారు కిలోమీటరు పొడవున సముద్రకోత నివారణకు గతంలో అనేకసార్లు పెద్ద బండరాళ్లును, సుమారు రెండు వేల సిమెంటు దిమ్మలు డంప్ చేశారు. అయినా కోతను నివారించలేకపోయారు. మరమ్మతులకు ఏటా రూ.కోట్లలో ఖర్చు పెడుతున్నా నిరుపయోగమవుతోంది.
భయం భయంగా గడుపుతున్నాం
కొన్నేళ్లుగా సముద్రపు కోత తీవ్రంగా పెరిగింది. తుపానుల సమయంలో తీర ప్రాంతంలో ఉన్న ఇళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రాణాలను గుప్పిట పెట్టుకుని భయంగా జీవించాల్సి వస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తీరప్రాంత రక్షణకు చర్యలు తీసుకోవాలి.
ా కారే సత్తిబాబు, మత్స్యకారుడు, ఉప్పాడ, యు.కొత్తపల్లి మండలం
కొత్త ప్రభుత్వంపై ఆశలు
జియో ట్యూబ్ టెక్నాలజీ పూర్తిగా ధ్వంసమైంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నా పరిష్కారం చూపడం లేదు. వైసిపి, టిడిపి, జనసేన నాయకులకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. తీరప్రాంత రక్షణకు చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.




