జూన్ 3, 24/7 తెలుగు న్యూస్:కొంప మునుగుతుందా..?
– ఓటింగ్ శాతం తగ్గుదలపై కమలంలో కలవరం
– ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా కన్పించని ధీమా
– ప్రభావం చూపని మందిరం
– దళితులు, ఓబీసీలు దూరం
– బ్యాలెట్ ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కాశ్మీరీలు
– ఈసీ విశ్వసనీయత, నిస్పాక్షికతపై సందేహాలు.
సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు అందరి చూపూ కౌంటింగ్ పైనే. ముందుగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అరుణాచల్ లోని మొత్తం 60 స్థానాల్లో బీజేపీ 46 సీట్లు సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం)కే ప్రజలు మరోసారి పట్టం కట్టారు.
2014, 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువగానే ఓటింగ్ శాతం నమోదైంది. ఇది అధికార పార్టీని కలవరపెడుతోంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి విజయాన్నే అంచనా వేస్తున్నప్పటికీ ఓటర్ల నిరాసక్తత ఎక్కడ కొంప ముంచుతుందోనన్న ఆందోళన బీజేపీలో కన్పిస్తోంది. పోలింగ్ శాతం తగ్గడానికి రాజకీయ పరిశీలకులు పలు కారణాలు చెబుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ నత్తనడకన సాగడం, ఎన్నికల పట్ల సాధారణ ప్రజల్లో నిరాసక్తత ఏర్పడడం, ఎలాగైనా మోడీ మరోసారి అధికారంలోకి వస్తారన్న అతి విశ్వాసం వంటివి పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా భావిస్తున్నారు.
న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంపై ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదన్నది వాస్తవం. గత రెండు ఎన్నికల్లోనూ ప్రజలు మోడీ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కన్పించడం లేదు. హిందూత్వ సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసికెళ్లేందుకు మోడీ చేసిన ప్రయత్నాలను వారు పూర్తి స్థాయిలో సమర్ధించలేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేశామంటూ మోడీ, ఇతర బీజేపీ నేతలు ఎంతగా ప్రచారం చేసుకున్నప్పటికీ ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 1990వ దశకం నుండి రామమందిర నిర్మాణమే బీజేపీకి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారిన విషయం తెలిసిందే.
కార్యాలయ హుందాతనాన్ని తగ్గించారు
ప్రధాని కార్యాలయ హుందాతనాన్ని తగ్గించిన మొట్టమొదటి వ్యక్తి మోడీయేనని కొద్ది రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ చేసిన పలు వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చాయి. ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు రేపిన తొలి ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్ర పుటల్లో నిలిచారని పరిశీలకులు వ్యాఖ్యానించారు. హిందువుల ఓట్లను సంఘటితపరచేందుకు ఆయన ముస్లింలపై విషం చిమ్మారు. ముస్లింలు అధిక సంతానం కలిగిన వారని, వారు చొరబాటుదారులని కించపరిచారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై కూడా ఆయన అసత్య ఆరోపణలు చేసి, హిందువుల్లో భయాందోళనలు రేపే ప్రయత్నం చేశారు. రాజ్యాంగానికి, లౌకికతత్వానికి ప్రధాని కట్టుబడి ఉండాలి. కానీ ఈ ఎన్నికల్లో ఆ నియమావళికి మోడీ తిలోదకాలు ఇచ్చారు.
దూరమైన దళితులు, ఓబీసీలు
ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమైంది. రాజ్యాంగాన్ని మార్చాలంటే తమకు పూర్తి స్థాయిలో మెజారిటీ అవసరమవుతుందని కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. అదీకాక ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు లభిస్తాయంటూ మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చెప్పుకోవడంతో ఓబీసీలు, దళితుల్లో భయం మొదలైంది. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా బీజేపీ తమ రిజర్వేషన్లకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న ఆందోళన దళితుల్లో కన్పించింది. 2019 నాటి విజయం పునరావృతం కావాలంటే ఉత్తరప్రదేశ్‌లోని దళిత ఓట్లు బీజేపీకి కీలకం అవుతాయి. యూపీలోని దళితులు, ముస్లింలు ఈసారి బీజేపీకి ఓటు వేయలేదని వార్తలు వస్తున్నాయి. మోడీ తన ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్‌పై అనేక ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీయేనని ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. కులం ఆధారంగా కాకుండా మత ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని నిందించారు.
రాజ్యాంగ కర్తవ్యాలను నెరవేర్చలేదు
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభలకు కూడా ఈసీ ఎన్నికలు నిర్వహించింది. సాధారణంగా పదవీకాలం ముగియడానికి ముందే చట్టసభలకు ఎన్నికలు నిర్వహిస్తారు. దీనివల్ల నూతన ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయడానికి కొంత సమయం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయానికి ఈసీ స్వస్తి చెప్పింది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభల పదవీకాలం ఆదివారంతో ముగిసిపోయింది. ఆ విషయాన్ని విస్మరించిన ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాల్లో కూడా మంగళవారమే ఓట్ల లెక్కింపు చేపడతామని తొలుత ప్రకటించింది. అయితే జరిగిన పొరబాటును తెలుసుకొని నాలిక కరుచుకున్న ఈసీ, ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును ముందుకు జరిపింది. అయినా పదవీకాలం ముగిసే నాటికి ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగపరమైన కర్తవ్యాలను నెరవేర్చడంలో ఈసీ విఫలమైందన్న విమర్శలు వచ్చాయి.
నాగాలాండ్,మణిపూర్‌లో బహిష్కరణలు
ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. నాగాలాండ్‌లోని ఆరు, మణిపూర్‌లోని ఒక జిల్లా ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వారంతా మోడీ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని ఈ బహిష్కరణ ద్వారా వ్యక్తపరిచారు. మణిపూర్‌లోని కాంగ్‌పోక్‌పీ జిల్లాకు చెందిన కుకీలు ఓట్లు వేయలేదు. తూర్పు నాగాలాండ్ రాష్ట్ర ఏర్పాటు హామీని నెరవేర్చనందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల ప్రజలు కూడా పోలింగ్‌ను బహిష్కరించారు.
విశ్వసనీయత కోల్పోయిన ఈసీ
ఓ వైపు ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచార సభల్లో విద్వేష ప్రసంగాలు చేస్తుంటే మరోవైపు ఎన్నికలు కమిషన్ చేష్టలుడిగి చూస్తూండిపోయింది. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన సంస్థ ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో సైతం కమిషన్ నిస్పాక్షికతపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేయలేదు. ప్రతి పోలింగ్ దశ ముగిసిన తర్వాత ఓటింగ్ శాతాన్ని ప్రకటించాల్సిన కమిషన్ తీవ్రమైన జాప్యం చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. దీనిపై పౌర సమాజ సభ్యులు కొందరు సుప్రీంకోర్టు తలుపు తట్టడం కూడా జరిగింది. ఎంపిక కమిటీ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి, తన అభీష్టం మేరకు ఇద్దరు కమిషనర్లను మోడీ నియమించిన తీరు కూడా ఈసీ విశ్వసనీయత, నిస్పాక్షికతను ప్రశ్నార్థకం చేసింది.
కాశ్మీర్‌లో ఓటరు చైతన్యం
సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. కాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం అందులో ఒకటి. కాశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు జరగగా ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. ఉగ్రవాదం పెచ్చరిల్లిన రోజుల నుండి జమ్మూకాశ్మీర్ ఓటర్లు పెద్దగా ఎన్నికలపై ఆసక్తి చూపలేదు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేయడం, రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంగా మారడం వంటి పరిణామాల తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. కాశ్మీర్ లోయలో శాంతి, సుస్థిరతలను సాధించడంలో తాము విజయం సాధించడం వల్లనే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని మోడీ చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు తమ ఆగ్రహాన్ని బ్యాలెట్ రూపంలో వ్యక్తపరిచారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.