Breaking News

ఆర్.బి.ఐ వితరణ…

82 Views

జూన్ 1, 24/7 తెలుగు న్యూస్ : ఆర్‌బిఐ వితరణ.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2023-24కు గాను భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బిఐ) కేంద్ర ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించడానికి నిర్ణయించడం ఆశ్చర్యకరం. 2022-23లో ఇచ్చిన రూ.87,416 కోట్లు డివిడెండ్‌ అధికమనుకున్నదాంతో పోల్చితే ఇది ఏకంగా 140 శాతం అదనం. బ్యాలెన్స్‌ పెరిగిన కారణంగా డివిడెండ్‌ మొత్తాన్ని పెంచినట్లు ఆర్‌బిఐ తన రిపోర్ట్‌లో పేర్కొంది. 2023-24లో బ్యాలెన్స్‌ 11.08 శాతం పెరిగిందని గురువారం తన వార్షిక నివేదికలో ఆర్‌బిఐ వెల్లడించింది. 2023 మార్చి నాటికి కేంద్ర బ్యాంకు వద్ద రూ.63.45 లక్షల కోట్ల బ్యాలెన్స్‌ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు 13.90 శాతం, బంగారం (డిపాజిట్లు, తాకట్టు రూపంలో) 18.26 శాతం, రుణాలు, అడ్వాన్సులు 30.05 శాతం చొప్పున పెరిగాయి. దీనివల్ల బ్యాలెన్స్‌ షీట్‌లో ఆస్తుల విలువ అమాంతం పెరిగిందని ఆర్‌బిఐ వెల్లడించింది. అదే విధంగా కరెన్సీ నోట్ల జారీ 3.88 శాతం, డిపాజిట్లు 27 శాతం, ఇతర అప్పులు 92.57 శాతం పెరిగాయని తెలిపింది. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా కేంద్రానికి డివిడెండ్‌ చెల్లించడానికి ఆర్‌బిఐ ఇవన్నీ కారణాలుగా చూపినట్లు కనిపిస్తోంది.
భారత ఆర్థిక వ్యవస్థ కానీ స్థూల జాతీయోత్పత్తి గానీ పెరిగిందేమీ లేదు సరికదా అంతకంతకూ దిగజారుతోంది. నిజానికి అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలన్నీ భారత్‌ రేటింగ్‌ తగ్గిస్తూ వస్తున్నాయి. అందుకు వారందరూ చూపిన కారణం ద్రవ్యలోటు, విదేశీ వాణిజ్య లోటు భారీగా ఉండడమే! ఇతర మార్గాల ద్వారా ద్రవ్యలోటు తగ్గించడం సాధ్యం కాని పరిస్థితిలో ఆర్‌బిఐని ప్రభావితంచేసి కేంద్ర ప్రభుత్వం డివిడెండ్‌ను విపరీతంగా పెంచేలా చేసిందన్నది అసలు విషయం. ఆ సొమ్ముతో ద్రవ్యలోటు పూడుస్తారు. కేంద్ర ప్రభుత్వ ఖజానా ఇబ్బందుల్లో పడితే ఒక ఆర్థిక వనరుగా డివిడెండ్‌ ను వాడుకోవాలని గతంలో ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. కానీ నరేంద్ర మోడీ రెండవసారి అధికారానికి వచ్చాక రాజ్యాంగపరమైన సంస్థలన్నిటినీ అస్మదీయులతో నింపివేశాక ఇలాంటివి సాధ్యమవుతున్నాయి. 2017-18 లో భారీ డివిడెండ్‌ కోసం ఒత్తిడి చేసినా ఆనాటి ఆర్‌బిఐ గవర్నర్‌, డిప్యూటీ గవర్నర్‌ తిరస్కరించి కేవలం 50 వేల కోట్లు మాత్రమే ఇచ్చిన విషయం ఆ తరువాత వెల్లడైంది. ఇలాంటివి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం.
ఇంత భారీగా బ్యాలెన్స్‌ పెరిగిందని చెబుతున్న ఆర్‌బిఐ బ్యాంకింగ్‌ రంగంలో ఆర్థిక మోసాలు ఎక్కువ అవుతున్నాయని తేల్చింది. ముఖ్యంగా సైబర్‌ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 2023-24 ఆర్థిక సంవత్సరం లో 36,075 బ్యాంకింగ్‌ మోసాలు జరిగాయి. 2022-23లో 13,564 జరగగా గత ఆర్థిక సంవత్సరంలో మోసాలు దాదాపు 300 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. 2021-22లో ప్రజలు రూ.45,358 కోట్ల సొమ్ము కోల్పోగా.. 2022-23లో రూ.26,127 కోట్లు, 2023-24లో రూ.13,930 కోట్లకు తగ్గడం కొద్దిగా ఊరట అనిపించవచ్చు కానీ పెరుగుతున్న మోసాల సంఖ్య మాత్రం అందరినీ నివ్వెరపరుస్తోంది. ‘గడిచిన మూడేళ్లలో ప్రయివేటు రంగ బ్యాంక్‌ల్లో ఎక్కువ మోసాలు జరిగాయి. డిజిటల్‌ పేమెంట్స్‌ విభాగంలో అధిక సంఖ్యలో మోసాలు జరిగితే, రుణ విభాగంలో అధిక మొత్తంలో మోసగాళ్లు నగదు కాజేశారు. 2021-22లో 3,596 కార్డ్‌, ఆన్‌లైన్‌ మోసాలు జరిగితే, 2023-24లో ఆ సంఖ్య 29,082కు పెరిగింది’ అని ఆర్‌బిఐ విశ్లేషించింది. విపరీత లాభాలు దండుకుంటున్న ప్రైవేటు బ్యాంకుల్లోనే మోసాలు ఎక్కువగా జరగడం గమనార్హం.
ప్రపంచాన్ని కుదిపేసిన 2008 నాటి ఆర్థిక సంక్షోభంలో భారత్‌ అంత తీవ్రంగా ప్రభావితం కాకపోవడానికి మన ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండడమేనని ఆర్థికవేత్తలు తేల్చి చెప్పారు. ప్రభుత్వ రంగంలోని మన బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ తదితర సంస్థలు, వివిధ నియంత్రణా వ్యవస్థల గొప్పదనమది. కానీ మోడీ గద్దెనెక్కాక వాటి స్వతంత్రతను దెబ్బతీస్తూ క్రమంగా బలహీనపర్చారు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఆర్‌బిఐని ఎంత నిమిత్తమాత్రురాల్ని చేశారో ఆర్‌టిఐ పత్రాల ద్వారా దేశం తెలుసుకోవలసివచ్చింది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా దాని సెంట్రల్‌ బ్యాంకు (మనకు ఆర్‌బిఐ, అమెరికాకు ఫెడ్‌.. ఇలా) ఎంత పటిష్టంగా, ప్రూడెంట్‌ గా ఉన్నాయనేది కీలకం. భారత రాజ్యాంగం రిజర్వ్‌ బ్యాంకు విధివిధానాల్లోనూ, అధికార విచక్షణలోనూ విశిష్ట స్థానాన్ని కల్పించింది. ఆ స్ఫూర్తిని నిలబెట్టడం అవసరం.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal