జూన్ 1, 24/7 తెలుగు న్యూస్ :ఆశాభావాల ఆఖరి దశ -యోగేంద్ర యాదవ్.…
జాతీయ కన్వీనర్, భారత్ జోడో అభియాన్
శ్రేయాస్ సర్దేశాయి, రాహుల్ శాస్త్రి సహకారంతో
భారతదేశ జాతీయ ఎన్నికల చరిత్రలో అతి సుదీర్ఘమైనది అయిన 18వ సార్వత్రక పోరు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్‌సభా నియోజకవర్గాలలో శనివారం పోలింగ్‌తో ముగియనున్నది. భారతీయ జనతా పార్టీ గెలుపునకు కష్టపడవలసిన రాష్ట్రాలు, తన సంఖ్యా బలాన్ని మెరుగుపరచుకోగలనన్న ఆశాభావం ఉన్న ప్రాంతాలలో ఈ ఆఖరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈ 57 స్థానాలలో 30ని మాత్రమే గెలుచుకున్నది. ఇండియా కూటమి 19 స్థానాలను గెలుచుకోగా ‘అలీన’ (ఏ కూటమిలోనూ భాగస్వామిగా లేని) పార్టీలు 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
2019 అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికన చూస్తే ఇండియా కూటమి మరో 12 సీట్లను అదనంగా గెలుచుకునే అవకాశమున్నది ఈ దశలో ఎన్డీఏ విజయావకాశాలు, ముఖ్యంగా బెంగాల్, ఒడిషా, పంజాబ్‌లలో గతంలో కంటే అధికంగానే ఉన్నాయి. కాగా ఈ దశలో ఎన్నికలు జరగనున్న స్థానాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం కూడా ఉన్నది. ప్రధానమంత్రి ప్రచారంపై పూర్తి శ్రద్ధ చూపించేందుకు వీలుగా ఈ ఏడో దశ ఎన్నికల నియోజకవర్గాలను నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి ఆయన ఉధృత ప్రచారం చేశారు. అయితే బీజేపీ శ్రేణులు ఊహించిన రీతిలో ఆ ప్రచారం విజయవంతంగా జరగలేదు.
బిహార్ భోజ్‌పూర్ ప్రాంతంలోని ఎనిమిది లోక్‌సభా నియోజకవర్గాలను గత సార్వత్రక ఎన్నికలలో బీజేపీ గెలుచుకున్నది. అయితే ఈసారి అవే నియోజకవర్గాలలో గెలవడం పాలక కూటమికి ఒక సవాల్‌గా ఉన్నది. 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ 8లోని 6 నియోజకవర్గాలలో ఎన్డీఏ కంటే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకే ఎక్కువ మంది ఎమ్మల్యేలు ఉన్నారు. ప్రస్తుత పొత్తుల ప్రకారం చూస్తే ఇండియా కూటమి మూడు నియోజకవర్గాలు జెహనాబాద్, పాటలీపుత్ర, అరాహ్‌లను తప్పక గెలుచుకుంటుంది. మరో 2 శాతం ఓట్లు అదనంగా లభిస్తే ఇండియా కూటమి గెలుచుకునే స్థానాల సంఖ్య 5కు పెరుగుతుంది. ఇండియా కూటమి కూడా 5 స్థానాలను గెలుచుకోవడానికి కృతనిశ్చయంతో కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రీయ జనతా దళ్ ‘My’ (ముస్లిం–యాదవ్) వ్యూహానికి స్వస్తి చెప్పి సకల సామాజికవర్గాలకు సమ ప్రాధాన్య మిచ్చే ‘A to Z’ వ్యూహానికి ప్రాధాన్యమిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో ఈ సార్వత్రక ఎన్నికలు పూర్వాంచల్‌లోని 13 నియోజకవర్గాలలో ముగియనున్నాయి. 2019 లోక్‌సభ, 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ ఈ నియోజకవర్గాలలో మంచి ఫలితాలను సాధించింది. గత సార్వత్రక ఎన్నికలలో 11 స్థానాలను కైవసం చేసుకున్నది. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలలో గోరఖ్‌పూర్, వారణాసి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అత్యధిక సీట్లను ఎన్డీఏ గెలుచుకున్నది. ఘాజీపూర్, ఘోసి లోక్‌సభా నియోజకవర్గాల పరిధిలోని అత్యధిక అసెంబ్లీ సీట్లు ఇండియా కూటమికి దక్కాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులలో మార్పు వచ్చింది. మొత్తం మీద యూపీలో ఎన్డీఏ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులలో 45 శాతం మంది అగ్రకులాలవారు కాగా ఇండియా కూటమి అభ్యర్థులలో అగ్రవర్ణాలవారు 27.5 శాతం మంది మాత్రమే ఉన్నారు.
పంజాబ్‌లో బీజేపీకి విజయావకాశాలు జారిపోయాయని చెప్పక తప్పదు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన బీజేపీ–అకాలీదళ్‌ల మధ్య 25 ఏళ్ల స్నేహ బంధం తెగిపోయింది. దరిమిలా గ్రామీణ సిక్కు రైతుల ఆగ్రహావేశాలను బీజేపీ చవిచూస్తోంది హిందూ ఓట్లను నిలుపుకోవడంతో పాటు హిందూ, సిక్కు దళిత ఓటర్ల మద్దతును సాధించుకోవడం ద్వారా కొద్ది సీట్లను గెలుచుకోవడానికి బీజేపీ శతథా ప్రయత్నిస్తోంది అదే సమయంలో కాంగ్రెస్, ఆప్ నుంచి చేర్చుకున్న సిక్కు నేతల సహాయంతో సిక్కు ఓటర్ల మద్దతును కూడా పొందేందుకు జాతీయ అధికార పక్షం ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలతో లబ్ధి పొందడానికి బదులు ప్రస్తుతమున్న రెండు సీట్లలో ఒక దాన్నిగానీ లేదా రెండిటిని గానీ బీజేపీ కోల్పోయే అవకాశమున్నది. పంజాబ్‌లో ప్రధాన పోటీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నది. ఈ రెండూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కావడం విశేషం. హిందూ, సిక్కు ఓట్లను సాధించుకోగల ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం ఆసక్తిదాయకంగా ఉన్నది. 2019లో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను గెలుచుకోగా బీజేపీ–అకాలీదళ్ కూటమి నాలుగు స్థానాలను గెలుచుకున్నది. ఆ సార్వత్రక ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకున్న ఆప్ ఆ తరువాత 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఐదింట నాలుగు స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో అధికారానికి వచ్చింది. ఆ ఫలితాల ప్రాతిపదికన చూస్తే ప్రస్తుత సార్వత్రక ఎన్నికలలో ఆప్ 11 స్థానాలను గెలుచుకోవచ్చు.
హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు లోక్‌సభా నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ 2019లో ఒక్క స్థానాన్నీ గెలుచుకోలేకపోయింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సాధించుకున్న ఓట్ల బలాన్ని నిలుపుకోగలిగితే ఈ సారి సిమ్లా, హమీర్‌పూర్‌లను కైవసం చేసుకోగలుగుతుంది. ఆప్ ఓట్లు కూడా కలిస్తే కాంగ్రా నియోజకవర్గం కూడా కాంగ్రెస్‌కు స్వాయత్తమవుతుంది. నాలుగో నియోజకవర్గమైన మండీలో కాంగ్రెస్ విజయానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రాబల్యమున్న ఉత్తర బెంగాల్, జంగల్‌మహల్ ప్రాంతాలలో ఎన్నికలు ఇప్పటికే ముగిసాయి. నేడు పోలింగ్ జరగనున్న కోల్‌కతా మహానగరంలోని లోక్‌సభ నియోజకవర్గాలు 2009 నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్నాయి. ఉత్తర కోల్‌కతా లేదా దక్షిణ కోల్‌కతా నియోజకవర్గాలలో ఒకటి తమకు దక్కగలదనే ఆశాభావం బీజేపీ శ్రేణులలో ఉన్నది. కోల్‌కతాలో ప్రధాన మంత్రి ర్యాలీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం బీజేపీ ఆశాభావానికి బలం చేకూర్చుతుంది. బెంగాల్ ప్రజలపై బీజేపీ తన సైద్ధాంతిక ప్రభావాన్ని ఎంతగా చూపినప్పటికీ కోల్‌కతా నగరంలో తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించగల సత్తా బీజేపీకి లేదన్నదే పలువురి అభిప్రాయంగా ఉన్నది.
జార్ఖండ్‌లో నేడు పోలింగ్ జరగనున్న మూడు నియోజకవర్గాలలో ఒకటి మాత్రమే కాంగ్రెస్ చేతిలో ఉన్నది. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికన చూస్తే ఆ మూడు స్థానాలూ ఎన్డీఏకే దక్కాలి. అయితే ప్రస్తుతం ఇండియా కూటమి, ఎన్డీఏ మధ్య తీవ్ర పోటీ ఉన్నది. ఈ మూడు స్థానాలను ఈ సారి తాను గెలుచుకోగలననే ఆశాభావం ఇండియా కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీకి ఓట్లతో పాటు సీట్ల లబ్ధి కూడా తప్పక సమకూరే రాష్ట్రం ఏదైనా ఒకటి ఉంటే అది ఒడిషా అని చెప్పితీరాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ, బిజూ జనతాదళ్ మధ్య తీవ్ర పోటీ నెలకొనివున్నది. లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఆఖరి దశలో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బిజూ జనతాదళ్ వాటిలో 4 స్థానాలను గెలుచుకున్నది. వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో 33 ఆ పార్టీకే దక్కాయి. 2022లో జరిగిన పంచాయత్ ఎన్నికలలో బిజూ జనతాదళ్ ఆ నియోజకవర్గాలపై తన పట్టును మరింత పటిష్ఠం చేసుకున్నది. ఒడిషాలో బీజేపీ తన సీట్ల సంఖ్యను బాగా పెంచుకోవాలంటే ఈ ఆఖరి దశలో అత్యధిక సీట్లను గెలుచుకోవలసి ఉంది. అందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆయన వారసుడుగా భావిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వికె పాండ్యన్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఒడిషా అస్మిత (ఆత్మగౌరం) గురించి బీజేపీ నేతలు అధికంగా మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఎన్డీఏ, ఇండియా కూటమి రెండూ ఈ ఆఖరి దశలో విజయం సాధించే ప్రాంతాలూ ఉన్నాయి, నష్టపోయే ప్రాంతాలూ ఉన్నాయి.
2019 అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికన చూస్తే ఇండియా కూటమి ఈ దశ పోలింగ్‌లో మరో 12 సీట్లను గెలుచుకునే అవకాశమున్నది. యూపీ, బిహార్‌లలో ఇండియా కూటమికి, బెంగాల్, ఒడిషాలలో ఎన్డీఏకు విజయావకాశాలు గతంలో కంటే అధికంగా ఉన్నాయి. నేడు పోలింగ్ జరగనున్న స్థానాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసి కూడా ఉన్నది.



