-బ్యాంకర్స్ తో మీటింగ్ లోఅదనపు కలెక్టర్ పూజారి గౌతమి
సిరిసిల్ల, మార్చి 21, 2024:
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ ల పరిధిలో అనుమానిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని బ్యాంకు అధికారులను అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో బాగంగా బ్యాంకుల కోఆర్డినేటర్లతో
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. బ్యాంకుల నుంచి రూ. లక్ష నగదు తీసుకున్నా, ఖాతాలో వేసిన వారి వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. రూ. 10 లక్షల కంటే ఎక్కువ జమ అయినా, తీసుకున్న వారి వివరాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా ఒకేసారి ఎక్కువ ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినా సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక ఖాతా తీసుకోవాలని, అన్ని లావాదేవీలు అదే ఖాతా నుంచి చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఖాతాలపై దృష్టి పెట్టాలని బ్యాంకుల కోఆర్డినేటర్లు వివరించారు. ఏటీఎంలు, బ్యాంకులకు నగదు తరలించే ముందు వాహనం నంబర్, వెళ్లే వారి పూర్తి వివరాలు, ఎంత డబ్బు తీసుకెళ్తున్నారు? తేదీ తదితర వివరాలు పక్కాగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం ఈఎస్ఎంఎస్ (ఎలక్షన్ సీజ్యూర్ మేనేజ్మెంట్ సిస్టమ్) యాప్ వినియోగం పై వివరించారు. ఎన్నికల నియమావళిని బ్యాంకు అధికారులు తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఎల్డీఎం మల్లికార్జున రావు, ఆయా బ్యాంకుల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
