ప్రాంతీయం

ప్రైవేట్ వస్త్ర తయారీ ఆర్డర్ల సాధనకు కృషి చేయాలి

85 Views

 

-ప్రైవేట్ వస్త్ర తయారీ ఆర్డర్ల సాధనకు కృషి చేయాలి::చేనేత జౌళి శాఖ సంచాలకులు అళుగు వర్షిణి

-ఆసక్తి గల ఆసాములకు సూరత్ లో శిక్షణ అందిస్తాం

-సెప్టెంబర్ నాటికి పాత బకాయలు చెల్లించేలా చర్యలు

-ప్రైవేట్ వస్త్ర పరిశ్రమ మార్కెట్ ను నేతన్నలు అన్వేషించాలి

-నేత కార్మికులకు అందాల్సిన సబ్సిడీలను సకాలంలో అందిస్తాం

-నేత కార్మికుల సమస్యల పరిష్కారం పై సంబంధిత కార్మిక ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన చేనేత జౌళి శాఖ సంచాలకులు

రాజన్న సిరిసిల్ల, మార్చి -16:

సిరిసిల్లలోని చేనేత కార్మికులు, ఆసాములు ప్రైవేట్ వస్త్ర పరిశ్రమ సంబంధించిన ఆర్డర్ల సాధన దిశగా కృషి చేయాలని , మార్కెట్ లో పోటి పడేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ఇతర సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చేనేత జౌళి శాఖ సంచాలకులు అళుగు వర్షిణి అన్నారు.

శనివారం చేనేత జౌళి శాఖ సంచాలకులు అళుగు వర్షిణి నేత కార్మికుల సమస్యల పరిష్కారం పై రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో సంబంధిత కార్మిక సంఘాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ సంచాలకులు అళుగు వర్షిణి మాట్లాడుతూ పరిశ్రమల మనుగడకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, అదే సమయంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వం పై ఆధారపడటం మంచిది కాదని, ప్రైవేటు రంగంలో గల అవకాశాలను సైతం అన్వేషించాలని సంచాలకులు తెలిపారు.

ప్రభుత్వం ఉన్న అవకాశాల మేరకు మాత్రమే బట్ట తయారీ కోసం ఆర్డర్లు ఇవ్వగలుగుతుందని, త్వరలో సిరిసిల్లతో పాటు నారాయణపేట, చౌటుప్పల్ వంటి ప్రాంతాలలో సైతం చేనేత క్లస్టర్లు వస్తాయని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే పని కల్పించే అవకాశం ఉండదని, ప్రైవేట్ రంగంలో గల అవకాశాలను వినియోగించుకోవాలని సంచాలకులు సూచించారు.

ఆసక్తి గల ఆసాములకు , నేతన్నలు బృందంగా ఏర్పాటు చేసి సూరత్ లో వస్త్ర పరిశ్రమ పనితీరు పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. తమిళనాడు సూరత్ వంటి ఇతర ప్రాంతాలో ఉన్న వస్త్ర పరిశ్రమల వద్ద నుంచి మన వద్ద అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రకారం రూపొందించే బట్ట ఆర్డర్లు సాధించే ప్రయత్నం చేయాలని ఆమె సూచించారు.

చేనేత రంగంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికత, ప్రింటింగ్ యూనిట్, ప్రాసెసింగ్ కట్టింగ్ యూనిట్స్ మొదలగు అంశాలను అవగాహన కల్పించుకుని సొంత పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వసతి కల్పిస్తామని అన్నారు.

చేనేత రంగంలో నూతన టెక్నాలజీని అలవర్చుకోవాలని, బ్యాంకు రుణాలు ద్వారా కొత్త యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, అనవసరపు ధర్నాలు పోరాటాలు చేయవద్దని, మనం తయారు చేసే వస్త్రంలో మంచి నాణ్యత ఉంటే అధిక ఆర్డర్లు వస్తాయని ఆమె పేర్కొన్నారు.

ప్రభుత్వం నూలు పై అందించే సబ్సిడీని ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా పాత బకాయిలను సైతం సెప్టెంబర్ నాటికి అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు.

గత 7 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు, ప్రభుత్వ బట్టలకు సంబంధించిన ఆర్డర్లు అందిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని, ప్రభుత్వం పైనే ఆధారపడకుండా బహిరంగ మార్కెట్ లో గల అవకాశాలను అంది పుచ్చుకోవాలని, ప్రైవేట్ రంగంలో నిలదొక్కుకునేందుకు నేత కార్మికులకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతి ఒక్క నేతన్న కార్మికుడు తప్పనిసరిగా టి నేతన్న యాప్ లో వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు.

అనంతరం సిరిసిల్ల చేనేత కార్మిక సంఘం నాయకులు వారి డిమాండ్లను తెలియజేస్తూ మొమోరండం అందజేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.గౌతమి, నేత కార్మికులు, ఆసాములు , కార్మిక సంఘం నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7