దౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపకులు సౌధాని భూమన్న యాదవ్ అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధిచేసిన పనులకు బిల్లులు రాకపోవడంతోనే ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో యాదవులకు గొర్రెలను పంపిణీ చేస్తానని చెప్పి నేటి వరకు పంపిణీ చేయలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు రాక 30 లక్షల మంది బలయ్యారని అన్నారు. దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు గెలవగానే పెండింగ్ లో ఉన్న నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతు తెలిపాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి 25 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన పేర్కొన్నారు..
