మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి గారు అమితంగా ప్రేమించే, అభిమానించే ఆయన బావ ఈ రోజు(మంగళవారం) మృతి చెందారు. దీంతో ప్రచారం మధ్యలోనే ముగించుకుని హుటాహుటిన కొండపాక మండలం దమ్మక్కపల్లికి చేరుకుని తన బావ గారి భౌతిక కాయాన్ని సందర్శించి దుఃఖించారు. ఈ సంఘటనతో నర్సారెడ్డి కుటుంబం విషాదంలో ఉండిపోయింది.
ఓ పక్క కేసీఅర్, ఈటెల రాజేందర్ వంటి హేమాహేమీలతో పోటీ పడుతున్న ఆయన… నడుము నొప్పి వేదిస్తున్నా అలుపెరగకుండా చెప్పులు లేకుండానే ఒక దీక్షలా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటి గడపను తడుతూ వస్తున్నారు. ఇతర అభ్యర్థుల వలే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీకి తావివ్వకుండా సాధారణమైన రీతిలో ప్రజలకు దగ్గరగా వెళుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారి ఆప్యాయత నడుమ ప్రచారం సాగిస్తున్నారు. 28న ప్రచారానికి చివరి రోజు కావడంతో గజ్వేల్ మండలం, జగదేవ్ పూర్ మండలంలోని పలు గ్రామాలను సందర్శిస్తున్న సమయంలో ఈ వార్త తెలియరావడంతో హుటాహుటిన ఆయన ప్రచారం మధ్యలోనే విరమించుకుని దమ్మక్కపల్లికి వెళ్ళిపోయారు. ఈ రోజు దమ్మక్కపల్లిలో జరగబోయే అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు.




