హైదరాబాద్ నవంబర్ 13 :బీజేపీ పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల లో ఎస్సి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి,10 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సి వర్గీకరణ చేయకుండా, మాదిగలను మోసం చేసి, నేడు ఎన్నికలు రాగానే మళ్ళీ ఓటు రాజకీయం చేస్తూ, మాదిగలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తే లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్ముల సంపత్ మాదిగ తేల్చి చెప్పారు.
హైదరాబాద్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి , ఎస్సీ వర్గీకరణ పై స్పష్టమైన హామీ ఇవ్వకుండా, ఇంకా కాలయాపన చేస్తూ, కొత్త కమిటిని ఏర్పాటు చేస్తామని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు.
గత ప్రభుత్వాలు వేసిన అన్ని కమిషన్లను కూడా తమ నివేదికను సమర్పిస్తూ మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పారు. 1965 లో లోకూర్ కమిషన్ నివేదిక మాదిగలు అన్యాయానికి గురవుతున్నట్టు తెలిపింది, 1996 లో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ నివేదిక కూడా మాదిగలు అన్యాయానికి గురవుతున్నట్టు తెలిపింది, 2008 లో ఉషా మెహ్ర కమిషన్ నివేదిక కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని, ఎస్సీ కులాల్లో మాదిగలు వెనుకబడ్డారని తేల్చింది. ఎస్సీల్లో అన్ని కులాలకు సమన్యాయం జరగాలంటే వర్గీకరణ చేయడమే మార్గమని సూచించింది. అయితే దీనికి రాజ్యాంగం లోని ఆర్టికల్ 341 కు సవరణ చేయాలని, రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో, కులాల వర్గీకరణను పార్లమెంటు ఆమోదించవచ్చని ఉషా మెహ్ర కమిషన్ సిఫార్సు చేశారు. ఆనాటి నుండి ఇప్పటివరకు సమస్యను పరిష్కరించకుండా, పార్లమెంటులో బిల్లు పెట్టకుండా మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి మాయ మాటలకు ఇక మీదట మాదిగలు మోసపోరని, మీ మాయ మాటలను మాదిగలు నమ్మరని, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని, అప్పుడే మా మాదిగలు నమ్ముతారని డిమాండ్ చేస్తున్నాం*.