అక్టోబర్ 01 రామగుండం పెద్దపెల్లి జిల్లా
దేశంలో అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నదా? ఇవాళ వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. పేదవాళ్లను కడుపున పెట్టుకొని చూసుకునే నాయకుడు మన కేసీఆర్. ఈ కాంగ్రెస్ పిచ్చోళ్లు 60 ఏళ్లు మనలను నానా బాధలు పెట్టారు.
అలాంటి నాయకులు మనకు కావాలా? తెలంగాణలో ఇప్పుడు అమలు అవుతున్న పథకాలన్నీ కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటెయ్యాలి. కాంగ్రెస్ వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. అసలు ఆ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతరో కూడా తెలియదు. అందుకే ప్రజలు కారు కావాలా? కాంగ్రెస్ నుంచి వచ్చే బేకార్ కావాలా ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
రామగుండంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ వచ్చారు. అసలు ఆయన ఏ ముఖం పెట్టుకొని వచ్చారో తెలియదు. కొన్నాళ్ల క్రితం కూడా రామగుండం వచ్చి ఒకే ఒక మాట అన్నారు. సింగరేణిని మేము ప్రైవేటీకరించం అని చెప్పి వెళ్లారు.
దేశంలో మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నదో అందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ వరుసగా ప్రైవేటు పరం చేస్తున్నారు. టోకున ఏ అదానీకో మరొకరికో అమ్మేయడం.. ఆ వచ్చిన చందానో దందాతోనో రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనేయడం.. అక్కడ అధికారం చేపట్టడం. గత తొమ్మిదేళ్లుగా ప్రధాని మోడీ ఇదే పరంపరగా పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని నేను అమ్మను అని ప్రధాని మోడీ నమ్మబలికారు. ఇక్కడి నుంచి వెళ్లిన వెంటనే సింగరేణికి సంబంధించిన నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టారు. పైగా మీరు కూడా వేలంలో పాల్గొని దక్కించుకోండని ఉచిత సలహా ఇచ్చారని కేటీఆర్ అన్నారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఉచితంగా కేటాయించినట్లే సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
సింగరేణిని కూడా నష్టాల బాట పట్టించి.. మీ దోస్తులకు కట్టబెట్టాలనే కుట్రలను పన్నుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
