ప్రాంతీయం

*పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలి*

99 Views

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిరిసిల్ల మున్సిపల్ యొక్క మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని, దీనిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కృషి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2003 సంవత్సరంలో ఆమోదించడబడిన మాస్టర్ ప్లాన్ ను భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సవరించడం జరుగుతుందని తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా మున్సిపల్ పరిధిలోని రహదారులు, కనెక్టింగ్ రోడ్లు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పరిశ్రమలు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వీటికి సంబంధించిన పూర్తి జాబితా మాస్టర్ ప్లాన్ లో చేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. విలీన గ్రామాలతో కూడిన ప్లాన్ ను రూపొందించడం జరుగుతుందని, సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించాలని కోరారు.గత మాస్టర్ ప్లాన్ లో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ను కొత్తగా వచ్చే మాస్టర్ ప్లాన్ లో మార్చే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల సమాచారం మాస్టర్ ప్లాన్ లో పొందుపరచిన అనంతరం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి, ఆర్&బి ఈఈ కిషన్ రావు, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, తహశీల్దార్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7