*మీరు పెట్టే పోస్టులకు మీరే బాధ్యులు.*
*సామాజిక’ బాధ్యతండీ..*
*అవెంత వరకు వెళ్తాయో గుర్తెరగాలి*
*పర్యవసానాలకు సిద్ధమవ్వాలి: సుప్రీం*
*న్యూఢిల్లీ, ఆగస్టు : సోషల్ మీడియా లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వారు వాటి పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది తమ పోస్టులు ఎంత దూరం వెళ్లగలవు? ఎంత ప్రభావం చూపిస్తాయనే స్పృహ వాటిని పెట్టే ప్రతీ ఒక్కరికీ ఉండాలని వ్యాఖ్యానించింది. 2018లో మహిళా జర్నలిస్టుల పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ శేఖర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు రాగా, అప్పటి అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు ఉపక్రమించింది. అన్నాడీఎంకే మిత్రపక్షం బీజేపీకి చెందిన శేఖర్ ఆ పోస్టును కొద్ది గంటల్లోనే తొలగించి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కేసులు కొనసాగడంతో వాటిని కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగా, సుప్రీంకోర్టుకు వచ్చారు.*
*సుప్రీంకోర్టు కూడా హైకోర్టునే సమర్థించింది. పోస్టు పెట్టిన రోజు శేఖర్ కంట్లో మందు వేసుకున్నారని, పోస్టు చేసిన కంటెంట్‌లోని ప్రతీ అంశాన్ని ఆయన క్షుణ్ణంగా చదవలేదని న్యాయవాది చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తీర్పు సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వాడేవారు తాము పోస్టు చేస్తున్న కంటెంట్ ఏంటనే స్పృహ కలిగి ఉండాలని సూచించింది. ఒక అంశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నపుడే దాని ద్వారా తలెత్తే విపరిణామాలకు బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా పోస్టు వదిలిన బాణంతో సమానమని, ఒకసారి పోస్టు చేశాక జరిగే నష్టాన్ని నివారించడం సాధ్యం కాదని చెప్పింది.*
