హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, రైతుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయిసమీక్ష సమావేశం నిర్వహించారు.ఇందులో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణతో ఇప్పటికే మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తూ తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థాయికి చేరుకుందన్నారు. అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ వంటి ప్రాజెక్టులు సహా మరికొంతకాలంలో పూర్తికానున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులతో రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి మరో కోటి టన్నులు పెరిగి ఏటా 4 కోట్ల టన్నులకు దిగుబడి చేరుకునే అవకాశాలున్నాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ విధానంలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను స్థాపించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా మిల్లింగ్ కెపాసిటీని పెంచే దిశగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రైస్ మిల్లులకు అదనంగా మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ మిల్లుల ఏర్పాటుకు విధివిధానాల ఖరారుకు కమిటీని ప్రకటించారు. రాష్ట్రంలో నిల్వ ఉన్న 1.10 కోట్ల టన్నుల వరి ధాన్యం, నాలుగు లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్‌సీఐ పలు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసి, రైతుకు మరింత లాభం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. అని సీఎం పేర్కొన్నారు.
*మరో రెండు కోట్ల టన్నుల ధాన్యం మిల్లింగ్*
రాష్ట్రంలో ఇప్పుడు రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు మాత్రమే ఉందని సీఎం పేర్కొన్నారు. మరో రెండు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా మిల్లులను ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి తగ్గట్టుగా అధునాత రైస్ మిల్లులను ఏర్పాటుచేయాలన్నారు. విధివిధానాల ఖరారుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షునిగా కమిటీని సీఎం ప్రకటించారు. ఈ కమిటీలో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ దామోదర్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంఓ అధికారులు, నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితో పాటు అంతర్జాతీయ రైస్ మిల్లు తయారీ కంపెనీ సటాకే’ ఇండియా డైరెక్టర్ ఆర్.కె.బజాజ్ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
*కొత్తగా అధునాతన మిల్లులు..*
‘‘అదనపు పంటను దృష్టిలో ఉంచుకుని.. అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం.. ప్రస్తుతం ఉన్న రైస్‌మిల్లులు కొనసాగుతాయి..ఇబ్బంది లేదు. కొత్త మిల్లుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ విధివిధానాలను ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభిస్తుంది. అంతర్జాతీయస్థాయిలో పేరున్న ‘సటాకె’ వంటి కంపెనీలతో చర్చించాం. వారితో శనివారం నుంచే కమిటీ చర్చలు జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించాం.’’సీఎం కేసీఆర్
