Breaking News

మణిపుర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది.

132 Views

ఇంపాల్‌: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ వీడియోపై రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

 

*ట్విటర్‌పై చర్యలు..?*

 

అటు ఈ వీడియో వైరల్ అవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహించింది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా ఈ వీడియోలను తక్షణమే తొలగించాలని ట్విటర్‌తో సహా ఇతర సామాజిక మాధ్యమ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున సామాజిక మాధ్యమాలు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలి’’ అని కేంద్రం పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ట్విటర్‌పై కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది

 

*సీఎంకు స్మృతి ఇరానీ ఫోన్‌..*

 

ఘటనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా స్పందించారు. ‘‘మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడి వారిని నగ్నంగా ఊరేగించిన ఘటన అత్యంత అమానవీయం. దీనిపై వెంటనే రాష్ట్ర సీఎం బీరేన్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశా. ఘటనపై దర్యాప్తు చేపడతున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు’’ అని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు.

 

ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం స్పందిస్తూ ఘటనను సుమోటోగా పరిగణించి కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు.

 

*నిందితుడి అరెస్టు..*

 

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వైరల్‌ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మే 4న ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం ఈ వీడియో వైరల్‌ అయ్యింది. వీడియోలో కనిపించిన మహిళల చుట్టూ కొందరు పురుషులున్నారు. వారంతా కలిసి సమీపంలోని పొలంలో బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది.

 

*‘ఇండియా’ మౌనంగా ఉండదు: రాహుల్‌*

 

ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మోదీ మౌనం, చేతకాని తనం వల్లే మణిపుర్‌లో అరాచకాలు జరుగుతున్నాయి. కానీ ‘ఇండియా’ (ప్రతిపక్షాల కూటమి పేరు) ఉండదు. మణిపుర్‌ ప్రజలకు మేం అండగా ఉంటాం. శాంతి మన ముందున్న ఏకైక మార్గం’’ అని కేంద్ర సర్కారుపై ట్విటర్‌లో మండిపడ్డారు. ఇలాంటి ఘటన సిగ్గుచేటని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సహించకూడదని అన్నారు.

 

*దిగ్భ్రాంతికరం: అక్షయ్‌ కుమార్‌*

 

ఘటనపై బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మణిపుర్‌ ఘటనకు సంబంధించిన వీడియో చూసి ఆవేదన చెందా. నిందితులకు అత్యంత కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నా. అప్పుడే మరొకరు ఇలాంటి పనులు చేయాలని కూడా ఆలోచించలేరు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *