ముస్తాబాద్, ప్రతినిధి జూలై 16, మండలంలోని పోత్గల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేదప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా నాణ్యమైన వైద్యం అందించడానికి 30.పడకల ఆసుపత్రి మంజూరు చేసింది. అందులో భాగంగానే ఆసుపత్రి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆదివారం రోజు కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రి నిర్మాణ పనులను నాణ్యతను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవనాన్ని స్వాగతిస్తున్నామని పేదప్రజలకు మెరుగైన వైద్యం కోసం నిర్మిస్తున్న భవనం ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కొలతలు లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. నాణ్యత లేకుండా నిర్మాణ పనులు జరుగుతే భవనం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఆసుపత్రికి వచ్చే ఎంతోమంది ప్రజలు ప్రాణాలు పోతాయని ఇలాంటి నాసిరకంలోని అంతర్యంమేమిటో సంబంధిత అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి ఎలాంటి తనిఖీలు చేయకుండా ఎంబీలు రికార్డులు చేయడం జరుగుతుందన్నారు. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని నాసిరకం నిర్మాణంతో భవనం నిర్మిస్తే కుప్పకూలి అమాయక ప్రజలు బలివుతారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోనే ఇలాఉంటే ఎలాఅని ఇప్పటికైనా ప్రజల మేలుకోరి నాణ్యతతో కూడిన శాశ్వత భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జిల్లాఅధికార ప్రతినిధి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, మాజీ సర్పంచ్ ఒరగంటి తిరుపతి, పెద్దమ్మల కేశవులు తదితరులు పాల్గొన్నారు.
