ఆధ్యాత్మికం

ఆశాడమాసం…

155 Views

ఆషాఢమాస విశిష్టత

ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ/వ్రతం/పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.

ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.

అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.

కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.

ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా, కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.

శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు, శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.

తిరుమల మనోహర్ ఆచార్య
శ్రీ రామానుజ యాగ్నిక పీఠం దక్షిణభారతదేశ సహాయ కార్యదర్శి
హైదరాబాద్

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *