తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవం. సిద్ధిపేట ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన బహుమతి దేశపతి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో ఆదివారం రాత్రి తెలంగాణ మాట, పాటల ఉధృతి ప్రజా కళల సోపతి, సిద్ధిపేట మట్టి బిడ్డ, కవి, గాయకుడు, వక్త దేశపతి శ్రీనివాస్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశపతి శ్రీనివాస్ కు పదవి కొత్త కాదని, ఉద్యమ సమయంలో తన పాటల, మాటల ద్వారా ఎంతో మంది ప్రేమను పొందారని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో ఆయనకు రావాల్సిన గౌరవం దక్కిందన్నారు. పట్టుదల, నిజాయితీ కేసీఆర్ పట్ల ప్రేమ దేశపతిలో మెండుగా ఉన్నాయని తెలిపారు. దేశపతి శ్రీనివాస్ తో తనకు 22 ఏళ్ల అనుబంధం ఉన్నదని, తన ఎదుగుదలలో ఆయన ముద్ర కూడా ఉన్నదని చెప్పుకొచ్చారు. నాడు తన ఉద్యమ ప్రసంగం, నేటి బడ్జెట్ ప్రసంగంలో కూడా దేశపతి పాత్ర ఉన్నదని, ప్రసంగం ఉద్యమ కెరటంలా ఉంటుందని పేర్కొన్నారు. పదవి బాధ్యత పెంచుతుందని, చట్ట సభల్లో మంచి చట్టాలను తయారు చేయడంలో దేశపతి కృషి చేయాలని కోరుతూ ఆయన మరింత ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీగా రాణించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సుపరిపాలనలో దేశపతి భాగస్వామ్యం కావాలని కోరారు. పదవులు ముఖ్యం కాదని, ఆత్మీయత ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ… తనను సిద్దిపేట ఎంతగానో తీర్చిదిద్దిందన్నారు. ప్రభుత్వం తనను గుర్తించి ఎమ్మెల్సీగా చేసిందని తెలిపారు. అలజడి, కేసీఆర్ ఊపిరి అని, ఆందోళన ఆయన జీవితం అని పేర్కొన్నారు. అందుకే మళ్ళీ దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఉద్యమాన్ని చేపట్టినట్లు వివరిస్తూ.. రాజకీయ ప్రసంగాలకు కొత్త పద్య పరిమళాలు చెప్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. అత్యంత ఆప్తుడు మంత్రి హరీశ్ రావు అని, ఇద్దరి ఉద్యమ బాట చెప్పలేనిదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను బయటి నుంచి చూస్తే వేరుగా ఉంటారు. కానీ దగ్గర నుంచి చూస్తే దాతృత్వం ఉన్న గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. దేశానికి ప్రస్తుతం శక్తి తరహాలో ఉన్న ఒక వ్యక్తిని కేసీఆర్ డీ కొంటున్నాడని, ఎంత సాహాసోపేత ప్రక్రియ అంటూ అభివర్ణించారు. కేసీఆర్ తో మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన మంత్రి హరీష్ రావు ధ్యాసంతా నిరంతరం సిద్దిపేట ప్రజల పట్ల ఉంటుందని, అలాంటి గొప్ప నాయకుడని, అదే మంత్రి గ్లామర్ అని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అభివర్ణించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ దంపతులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, జడ్పి చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ ఫారూఖ్, మాజీ సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి, కార్పోరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ బీవేరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, మరసం జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి, వివిధ సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.