ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తన అలవాటుగా మార్చుకోని కష్టం ఏదైనా ఆదుకోవడమే తన కర్తవ్యంగా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదల కన్నీరు తుడుస్తూ అక్కున చేర్చుకుంటున్నారు సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో పూరి గుడిసె ఖాళీపోవడంతో రోడ్డున పడ్డ కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి, నిత్యవసర సరుకులు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయపోల్ మండల పరిధిలోని సయ్యద్ నగర్ గ్రామంలో నిరుపేద కుటుంబమైయిన నాజియా పఠాన్ గౌస్ దంపతులు కొద్దిపాటి స్థలంలో పూరి గుడిసె ఏర్పరచుకొని నివాసం ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, కూతురు ఉండగా ప్రస్తుతం నజియా గర్భవతి కూడా. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం కేవలం పఠాన్ గౌస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వృత్తి రీత్యా వీరు రాయి కొట్టుకొని జీవిస్తుంటారని, అలాంటి పేద కుటుంబం తమ రెక్కలు నమ్ముకుని జీవిస్తున్నారని సోమవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో వారి పూరి గుడిసె దగ్ధమవడం బాధాకరమన్నారు. వారి గుడిసెలో ఉండే నిత్యవసర సరుకులు, బియ్యం, బట్టలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. కనీసం తినడానికి తిండి లేక వారి కుటుంబం రోడ్డున పడిందన్నారు. ఉన్న గూడు కాస్త అగ్గిపాలు కావడంతో వారికి నివాసం ఉండడానికి చోటు కరువైందన్నారు. వీరి పరిస్థితి చూస్తుంటే ఎంతో విషాదకరంగా ఉందని మానవత్వంతో తమ వంతు సహకారం చేయడం జరిగిందన్నారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, అలాగే ఇంకా మానవతావాదులు ఎవరైనా ఆదుకొని వారికి భరోసానివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ నగర్ ఇంచార్జ్ సర్పంచ్ మౌలాన, ఉప సర్పంచ్ బాబు, సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ ఉమర్, గ్రామస్తులు గౌస్, అబ్బాస్, అప్సర్, మహబూబ్, షాదుల్, తదితరులు పాల్గొన్నారు.
