రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 19:
చిన్నారులపై లైంగిక దాడుల, అత్యాచార కేసులకు సత్వర పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును జిల్లా కోర్టు సముదాయంలో నిర్మించారు. శనివారం ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రారంభించారు. ముందుగా ఆయనకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసి దీవెనలు అందించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టును రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం చేస్తున్న కృషిలో భాగంగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశామన్నారు. సత్వరన్యాయం కోసం ఏర్పాటుచేసిన ఈ కోర్టులు సమర్థవంతంగా పని చేసేలా అందరూ సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, రాజన్న సిరిసిల్ల 9 వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం. జాన్సన్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ, జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య, బార్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
