రియల్ ఎస్టేట్ వ్యాపారుల దాస్టికానికి ఓ నిరుపేద రైతు పంట నష్టపోయి, ఆందోళనతో గుండెపోటుకు గురి అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాభాలే వ్యాపారంగా గ్రామాలను చెరబడుతున్న రియల్ వ్యాపారుల దాస్టికానికి మాచ్చుతునకగా నిలుస్తున్న ఘటన దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత రైతు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి వారసులకు చెందిన సుమారు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేగుంట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి, వడియారం గ్రామానికి చెందిన జీవన్ రెడ్డి, విట్టల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు శ్రీనివాస్ సాగు చేస్తున్న పంట పొలంలోకి వచ్చి రెండు ఎకరాల కోతకు వచ్చిన ఆముదం పంట మరో ఎకరం వరి పంటను ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. దానికి తోడు రైతును బెదిరించడంతో రైతు తీవ్ర అనారోగ్యం పాలై గజ్వేల్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. కాగా విషయం తెలుసుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి రైతుకు అండగా నిలిచారు. తక్షణ సాయం కింద 50,000 వేల రూపాయలను దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్, ఎంపీపీ సంధ్య రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. కాగా రియల్ ముసుగులో పంట ధ్వంసం చేసిన వారి వేధింపుల నుండి రైతును కాపాడి పూర్తిస్థాయిలో రైతులు ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పల్లెల్లో చిచ్చు రేపుతూ రైతులను కూలీలుగా మారుస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు. మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్న రైతును ఇబ్బందులకు గురిచేస్తూ పంట ధ్వంసం చేయడం ఆటవిక చర్యగా వారు అభివర్ణించారు. కౌలు రైతుకు అన్ని రకాలుగా అండగా ఉంటామని సందర్భంగా వారు పేర్కొన్నారు. వీరి వెంట టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, గొడుగుపల్లి బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, గ్రామ యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
