రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, మున్సిపాలిటీలలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కంటి చూపు మందగించి కంటిచూపు సమస్యలతో ఏ ఒక్కరు బాధపడకూడదని భావించి ప్రభుత్వం ఈనెల 18 నుండి జూన్ 30వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల వారీగా మున్సిపాలిటీలలో వార్డుల వారీగా షెడ్యూల్ ప్రకారం కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించనున్నారు. ఇందుకుగాను జిల్లాలో నేత్ర వైద్యానిపుణులతో కూడిన 45 వైద్య బృందాలు పనిచేయనున్నాయి. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈనెల 12వ తేదీ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై ప్రజాప్రతినిధులకు, వైద్య ఆరోగ్య గ్రామీణ అభివృద్ధి, పురపాలక శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడం పై అవగాహన కల్పించి మార్గనిర్దేశం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యవేక్షణలో కంటి వెలుగు నిర్వహణ ఏర్పాట్లు ముమ్మారంగా సాగుతున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాలలో జిల్లా పంచాయతీ అధికారి, డిఆర్డిఓ లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, స్థానిక వైద్య అధికారుల సమన్వయంతో షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లు చేయడం జరిగింది. 18వ తేదీనా ఖమ్మంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించగానే షెడ్యూల్ ప్రకారం నిర్దేశిత గ్రామాలు, మున్సిపాలిటీ వార్డులలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.
