జూన్ 20, 24/7 తెలుగు న్యూస్:కొత్త నేర చట్టాలను వెనక్కి తీసుకోవాలి.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా?
ప్రజల హక్కులకు నష్టం చేకూర్చే మూడు కొత్త నేర చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. పౌర హక్కులను మరింతగా అణిచివేసే కొత్త నేర చట్టాలు ఎవరి ప్రయోజనాల కోసం? అనే అంశంపై బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మహిళా, ట్రాన్స్‌జెండర్ల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జూలై ఒకటో తేదీ నుంచి ఐపీసీ-1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీపీసీ)1973 స్థానంలో భారతీయ సురక్ష సంహిత చట్టం(బీఎస్ ఎస్) ఇండియన్ ఎవిడెన్స్ (ఐఈఏ)-1872 స్థానంలో భారతీయ సాక్ష్య అధినియమం(బీఎస్ ఏ) లాంటి ప్రమాదకర చట్టాలు అమల్లోకి రాబోతున్నాయని వివరించారు. భారతీయ సాక్ష్య అధినియమం ప్రకారం సెర్చ్ వారెంట్ లేకుండానే ఇండ్లల్లో సోదాలు నిర్వహించే హక్కును పోలీసులకు కల్పించారని తెలిపారు. దీంతో పాలకులను ప్రశ్నించే వారి ఇండ్లపై రాజకీయ కక్షలో భాగంగా తరుచూ దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను న్యాయవాదులు వాదించే సమయంలో, న్యాయమూర్తులు తీర్పులను వెల్లడించే సమయంలోనూ పాత చట్టాలను, కొత్త చట్టాలను ముందు పెట్టుకుని చూడాల్సిన పరిస్థతి ఉందనీ, దీంతో గందరగోళం నెలకొనే అవకాశముందని వివరించారు. పాత కేసులను పూర్వ చట్టాల పరిధిలోనే పరిష్కరించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. కొత్త నేర చట్టాలపై ప్రజల్లో విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలనీ, న్యాయ వ్యవస్థల్లో భాగంగా ఉన్న అన్ని వ్యవస్థల అభిప్రాయాలను సేకరించాలని డిమాండ్ చేశారు. మూడు కొత్త చట్టాలపై పార్లమెంట్లో చర్చించాలనీ, పున:సమీక్షించాలని కోరారు. దేశ ప్రజలను పీడించే కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురావడం సరిగాదన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ..మూడు కొత్త నేర చట్టాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రజాసమస్యలపై ప్రశ్నించడాన్ని కూడా నేరపూరితంగా చూపెట్టడం దారుణమన్నారు. ఆధునిక అవసరాల రీత్యా చట్టాలను మార్చే సందర్భంలో కొత్త చట్టాల్లో పొందుపరిచే ప్రతి అంశంపైనా చర్చ జరగాలనీ, అంతిమంగా అది ప్రజామోదం పొందేలా చూడాలని ఆకాంక్షించారు. డిజిటల్ సాక్ష్యాలు ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. డిజిటల్ వేదికగా జరుగుతున్న మోసాలను, తప్పుడు ప్రచారాలను ప్రస్తావించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లేని సందర్భంలో ఈ చట్టాలు ఆమోదం పొందాయి కాబట్టి అంత చర్చనీయాంశం కాలేదేమో అని అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల విషయం ఉమ్మడి జాబితాలోనిది కాబట్టి రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండా, చర్చించకుండా, ప్రజల్లో చర్చకు పెట్టకుండా చట్టాలను తీసుకురావడంపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఒకరిద్దరు సీఎంలు అభ్యంతరం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ చట్టాల పేరులో ఉన్న భారతీయతను కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్నిస్తూ సంస్కృతం పేర్లు పెట్టడమేంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్రంలో బలమైన ప్రతిపక్షం ఉన్నందున దీనిపై ప్రజల్లో చర్చపెట్టి దుర్మార్గాన్ని విడమర్చి చెప్పి చైతన్యపరిస్తే పార్లమెంట్ లోపల కూడా చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతుందన్నారు. ట్రాన్స్‌జెండర్ల సంఘం నుంచి రచన మాట్లాడుతూ..ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కల్పించామని పాలకులు సమర్ధించుకుంటున్నారనీ, వాస్తవానికి అంతకు ముందున్న చట్టాల కంటే ప్రమాదకరంగా, క్రూరస్వభావంతో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రధాన జీవనాధారం అయిన యాచక వృత్తిని నేరపూరితంగా చూపెట్టడం దారుణమన్నారు. తమకే కాకుండా మహిళలకు, సామాన్య పౌరులకు కూడా హాని కలిగించేలా, స్వేచ్ఛను హరించేలా చట్టాలున్నాయని వాపోయారు. మహిళా సంఘాలు, సామాజిక సంఘాల ప్రతినిధులు సంధ్య, విమల, ఝాన్సీ, సజయ, ఖలేదా మాట్లడుతూ..ప్రజాస్వామిక భావ ప్రకటనా కార్య క్రమాలను కూడా ప్రభుత్వాలు నేరాలుగా చూపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొత్త నేర చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తే దేశం ఫాసిస్టు రాజ్యంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలరాజు, వసుంధర, జ్యోతి, కృష్ణకుమారి, పాల్గొన్నారు.
