జూన్ 20, 24/7 తెలుగు న్యూస్: పింఛన్ మహా ప్రభో…
డబ్బులందక రెండు నెలలు….
మందుగోలీలు లేక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
అల్లాడుతున్న వృద్ధులు, వికలాంగులు
సాయం కోసం ఒంటరి మహిళలు, వృత్తిదారులు
చేయూత కింద రూ.4-6 వేల పింఛన్ ఎప్పుడో
పింఛన్ మహా ప్రభోదీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వృత్తిదారులు ఇలా ఏ ఆసరా లేనోళ్లంతా సర్కార్ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్ పైసలొస్తే రోగానికి మందుగోలీలు, నాలుగు మెతుకులు దొరుకుతాయని ఆశతో ఉన్నారు. కానీ రెండు నెలలుగా వారికి పింఛన్ అందడం లేదు. అధికారంలోకి వస్తే చేయూత కింద రూ. 4 వేల పింఛన్ ఇస్తామన్న మాట పక్కన పెట్టి గతం నుంచీ ఇస్తున్న రూ.2 వేల పింఛన్ కూడా ఇవ్వడం లేదు. దీంతో పింఛన్ చేతికందక పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీగా మందులు, ఇంజక్షన్స్, వ్యక్తిగత అవసరాలకు చేతిలో చిల్లిగవ్వ లేక మనోవేదనకు గురవుతున్నారు. బ్యాంక్ ఖాతాలో పైసలు ఎప్పుడు పడతాయోనని ఎదురు చూస్తున్నారు.
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఏ ఆసరా లేని వాళ్లకు చేయూతనందించాలనే ఉద్దేశంతో అప్పటి పాలకులు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. సమాజంలో స్వశక్తితో తమ అవసరాలు తీర్చుకోలేక ఇతరుల ఆర్థిక సాయం ఉంటే తప్ప జీవితాల్ని నెట్టుకురాలేని పరిస్థితుల్లో ఉన్న వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం పింఛన్ అందజేస్తోంది. రూ.75తో ప్రారంభమైన పింఛన్ కాస్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో రూ.2016 అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4016 ఇస్తామని చెప్పింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలలుగా పింఛన్ డబ్బులు అందని పరిస్థితి. ఏప్రిల్, మే నెలలో ఇవ్వాల్సిన డబ్బులు లబ్దిదారుల ఖాతాలో వేయలేదు. పెంచుతామన్న పింఛన్ డబ్బులు కూడా పెంచలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారిలో వృద్ధులు, వితంతువులు వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ బాధితులు, డయాలసిస్, ఫ్లోరోసిస్ ఇతర పింఛన్‌దారులు కలిపి మొత్తం 44 లక్షల మంది లబ్దిదారులున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనలో కొత్తగా పింఛన్ కోసం 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 469575 మంది లబ్దిదారులకు పింఛన్ ఇస్తున్నారు. వీరి కోసం ప్రతి నెలా రూ.102.32 కోట్ల నగదుని లబ్దిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేది. ఇందులో 37785 మంది వికలాంగులకు రూ.15.17 కోట్లు, మిగతా 431790 మందికి రూ.87.04 కోట్ల చొప్పున పింఛన్‌దారులకు చెల్లించేది.
రెండునెలలుగా అందని వైనం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ వచ్చింది. నేరుగా ఆర్థిక భారం పడే కొన్ని పథకాల విషయంలో మాత్రం వాయిదా వేసింది. అందులో చేయూత పథకం కింద ప్రతి నెలా ఇవ్వాల్సిన పింఛన్ డబ్బుల విషయంలో కొంత జాప్యం జరుగుతోంది. కొందరు లబ్దిదారుల్లో నిత్యం మందుగోలీలు, ఇంజక్షన్స్ వేసుకునే వాళ్లున్నారు. ముఖ్యంగా డయాలసిస్, హెచ్ఐవీ బాధితులు నిత్యం వైద్య సేవలు పొందుతూనే ఉండాలి. అలాగే వికలాంగులు పూర్తిగా పింఛన్ ఆధారంగా జీవిస్తున్న వాళ్లే అధికంగా ఉన్నారు. స్వతహాగా ఏ కాయా కష్టం చేయలేక, కదల్లేక, మాట్లాడలేక రెండో మనిషి సాయముంటే తప్ప కదల్లేని వాళ్లకూ పింఛన్ ఎంతో అవసరం. నిత్యం మందులు, వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు పైసలు కావాలి. మరో పక్క వృద్ధులైతే షుగర్, బీపీ ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వారికి పింఛన్ చేతికందితే తప్ప మందుబిల్ల కొనలేని పరిస్థితి. ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు సైతం పింఛన్ డబ్బులొస్తేనే కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ ఎప్పుడు పడుతుందోనన్న ఆశతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జూన్ 20వ తేదీ వచ్చినా ఇంకా మే నెల పింఛన్ ఖాతాలో పడకపోతే తమ అవసరాలు ఎలా తీరుతాయని పలువురు పింఛన్‌్‌దారులు వాపోతున్నారు.
సాయం కోసం ఎదురుచూపు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పింఛన్ కోసం లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల వల్ల పింఛన్ డబ్బులందడంలో జాప్యం జరిగిందని చెబుతున్న ప్రభుత్వం కనీసం మే, జూన్ నుంచైనా రెగ్యులర్‌గా ఇవ్వని పరిస్థితి ఉండడంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 161662 మంది పింఛన్‌దారులుండగా మెదక్ జిల్లాలో 116728 మంది, సిద్దిపేట జిల్లాలో 191185 మంది పింఛన్‌దారులున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పింఛన్‌్‌దారులు ఇలా ఉన్నారు. వితంతువులు 174940 మంది, వృద్ధులు 164405 మంది, వికలాంగులు 37785 మంది, బీడీ కార్మికులు 41608 మంది, ఒంటరి మహిళలు 15304 మంది, కల్లుగీత కార్మికులు 4814 మంది, చేనేత కార్మికులు 3525 మంది, బీడీ టేకీదారులు 300 మంది, హెచ్ఐవీ పేషెంట్స్ 3107 మంది, కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ 339 మంది చొప్పున పింఛన్ లబ్దిదారులున్నారు.
చేయూత కింద రూ.4 వేలు ఎప్పుడో..?
అధికారంలోకి వస్తే చేయూత కింద రూ.4 వేల పింఛన్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రి అయ్యారు. పాలనా పగ్గాలు చేతపట్టి ఆరు నెలలు కావస్తున్నా చేయూత కింద ఇస్తామన్న పింఛన్ డబ్బుల్ని పెంచకపోవడంతో.. వారంతా సీఎం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. పెరిగినన అవసరాలు, ధరలతో ఆ డబ్బులు దేనికీ సరిపోవట్లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే రెండింతలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి నెలా ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని రకాల పింఛన్ల కోసం అప్పటి ప్రభుత్వం రూ.102 కోట్ల మేర చెల్లించేది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 4 వేలకు పెంచితే ప్రతి నెలా రూ.204 కోట్లు కేటాయించాల్సి వస్తది. ఆరునెలలు దాటినందున ఇకనైనా పింఛన్‌ను రెండింతలు చేసి ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లించాలని పింఛన్‌దారులు కోరుతున్నారు.
వికలాంగులను గోస పెట్టొద్దు : రామచంద్రం,వికలాంగుడు, ఎన్‌పీఆర్‌డీ
మాబోటి వికలాంగుల్ని గోస పెడితే ఏం న్యాయం. పింఛన్ రాక రెండు నెళ్లు. వికలాంగుల్లో పెళ్లం పిల్లలున్నోళ్ల కు ఉప్పు, పప్పు కొనలేక పూట గడుస్తలేదు. రోగాలున్నోళ్లకు మందుబిల్లకు పైసల్లేవు. చాలా మందికి పెళ్లిళ్లు కాలేదు. ఒంటరి జీవితంలో పింఛనే ఆధారంగా ఉంది. అలాంటి వాళ్లు కొందరు సంగారెడ్డిలో బిక్షమెత్తుకుంటున్నరు. పింఛన్ పైసలొస్తే మందుగోలి, వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటం. ఎన్నికల్లో చెప్పినట్లు వెంటనే పింఛన్‌ను రూ. 6016 చేసి రెగ్యులర్‌గా అందేట్లు చూడాలి. లేనిపక్షంలో వికలాంగులం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సి వస్తది.




