సినీనటుడు చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందూతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్, ఎపి సిఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..పౌరానిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యానటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారు.
చంద్రమోహన్ తో పాటు పలు చిత్రాల్లో నటించా. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా అని అన్నారు.
చంద్రమోషన్ మృతిపై ఎక్స్ లో చిరంజీవి స్పందిస్తూ ‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఆయన నటించారు.
తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారిందన్నారు.
ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
