దౌల్తాబాద్: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరికాదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సపాయి కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 రోజులే పాలిస్తుందని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని అన్నారు. మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి తల్లి మరణించగా కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, మాజీ సర్పంచ్ అది వేణుగోపాల్, నాయకులు దశరథ రెడ్డి, భద్రయ్య, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు….
