స్నేహితులంటే కలిసి తిరగడం చదువుకోవడమే కాదు స్నేహితులు, స్నేహితుల కుటుంబాలు కష్టాలలో ఉన్నప్పుడు మేమున్నామంటూ చేయూతనివ్వడమే నిజమైన స్నేహానికి నిదర్శనం. రాయపోల్ పదవ తరగతి 2004- 2005 బ్యాచ్ కి చెందిన స్నేహితులలో ఒకరైన రాయపోల్ గ్రామానికి చెందిన గూని ఆంజనేయులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మంగళవారం వారి కుటుంబ సభ్యులకు స్నేహితులు ఆంజనేయులు భార్య శ్యామల, కూతురు ద్విజశ్రీ మీద 50,000/- వేల రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (స్థిర నిధి) చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాతోపాటు కలిసి చదువుకున్న ఆంజనేయులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించడం చాలా బాధాకరమని, మా స్నేహితుడు ఆంజనేయులు లేని లోటు తీర్చలేనిది, కానీ మా స్నేహానికి గుర్తుగా వారి కుటుంబానికి భరోసాను కల్పించడానికి 50,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం బ్యాంకులో స్థిర నిధిగా అందజేయడం జరిగిందన్నారు. ఆంజనేయులుకు భార్య శ్యామల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిది అసలే నిరుపేద కుటుంబం తండ్రి లేని ఇద్దరు చిన్న ఆడపిల్లలతో బ్రతుకు పోరాటం సాగించడం శ్యామలకు తలకు మించిన భారంగా మారింది. వారికి ఇక ముందు కూడా చేదోడు వాదోడుగా ఉంటామని మనోధైర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ 2004-2005 బ్యాచ్ స్నేహితులు పుట్ట రాజు, నవీన్ గౌడ్, స్వామి, యాదగిరి, రాజు గౌడ్, పి.కనకయ్య, కె.వి కనకయ్య, ఎస్.కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
